హైద్రాబాద్ లో నిరసనలు
హైద్రాబాద్, డిసెంబర్ 19,
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని భావించారు. కానీ అక్కడికి వెళ్లడానికి ముందే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ (ఐఎస్‌బీ) విద్యార్థులతో కలిసి హెచ్‌సీయూ విద్యార్థులు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. జంట నగరాల్లో నిరసన ప్రదర్శనలపై ఆంక్షలు విధించినందున.. బహిరంగ సభలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆందోళనలకు సిద్ధపడిన వారిని అరెస్టు చేసి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.మొయినాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా విద్యార్థులు నిరసన ప్రదర్శనలకు దిగారు. డప్పు కొడుతూ, పాటలు పాడుతూ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనలు చేశారు. పౌరసత్వ చట్టాన్ని, ఎన్ఆర్సీని అమలు చేయొద్దని వారు డిమాండ్ చేశారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడుతూ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి వెళుతుండగా మమ్మల్ని ఇక్కడకి తీసుకొచ్చారని రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము న్యాయంగా ధర్నా చేస్తుంటే పోలీసులు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడకి తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద కమ్యూనిస్టులు కూడా ఆందోళనకు దిగగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.