గిరిజనుల ఉత్సత్తులకు భలే డిమాండ్
రాజమండ్రి, డిసెంబర్ 20,
ఆదివాసీలు సేకరించిన తేనెకు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా శుద్ధిచేసిన తేనెకు ఇటీవల కాలంలో విపరీతమైన మార్కెట్ విస్తరణ జరిగింది. ఒక్క ఏపీలోనే ఏడాదికి రూ.4.50 కోట్ల విలువైన తేనె విక్రయం జరుగుతోంది. ఆదివాసీ ప్రాంతానికి సమీపంలో వున్న రాజమహేంద్రవరంలో నెలకొల్పిన జీసీసీ తేనె శుద్ధి కర్మాగారం నుంచి నిత్యం రూ.లక్షల విలువైన తేనె ఎగుమతి జరుగుతోంది. రాజమహేంద్రవరంలోని తేనె శుద్ధి కేంద్రం నుంచి ఏడాదికి 4 లక్షల కిలోల తేనె సేకరణ జరుగుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ఆదివాసీ ప్రాంతం నుంచి 2.5 లక్షల కిలోలు, ఇతర రాష్ట్రాల నుంచి 1.5 లక్షల కిలోల తేనె సేకరణ జరుగుతోంది. ఏపీలో రెండు వేల మంది ఆదివాసీలు తేనెను సేకరిస్తున్నారు. ఆదివాసీల నుంచి కిలో ముడి తేనెను రూ.195కు కొనుగోలుచేస్తున్నారు. శుద్ధిచేసిన స్వచ్ఛమైన తేనెను బాట్లింగ్ చేసి బహిరంగ మార్కెట్‌లో రూ.375కు విక్రయిస్తున్నారు. 50 గ్రాముల నుండి 5 కిలోలల వరకు బాట్లింగ్ చేసి రాజమహేంద్రవరంలోని ఈ కేంద్రం నుంచి మార్కెటింగ్ జరుగుతోంది. రోజుకు 2.5 లక్షల కిలోల ముడి తేనెను శుద్ధిచేసే సామర్ధ్యం ఇక్కడి జీసీసీ ప్లాంటుకు ఉంది. 100 కిలోల ముడి తేనె నుంచి 95 కిలోల శుద్ధి తేనె లభిస్తుంది. ఏపీలో మొత్తం ఈ తేనెకు 110 మంది పంపిణీదారులున్నారు. ఏడాదికి జీసీసీ రూ.నాలుగున్నర కోట్ల టర్నోవర్ లభించింది. 1992లో రాజమహేంద్రవరంలో జీసీసీ రూ.5 లక్షల పెట్టుబడితో యూనిట్‌ను నెలకొల్పింది. 2007లో రూ.12 లక్షలతో యూనిట్ సామర్ధ్యాన్ని పెంచుకుంది. ప్రస్తుతం 2.5 లక్షల కిలోల తేనె శుద్ధిచేస్తున్నారు. ముడి తేనెను చింతపల్లి, పాడేరు, రంపచోడవరం, శ్రీశైలం, తిరుపతి ప్రాంతాల నుంచి సేకరిస్తున్నారు. 45 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ముడి తేనెను వేడిచేసి స్వచ్ఛ తేనెను ప్రాసెస్ చేస్తున్నారు. 2016-17లో 1,70,100 కిలోల ముడి తేనెను ప్రోసెస్ చేశారు. 2017-18లో 1,44,200 కిలోలు ప్రోసెస్ చేశారు. జీసీసీ నన్నారి పేరుతో ఒక షెర్బత్, బిల్వ షర్బత్‌లను కూడా చిత్తూరు జిల్లాలో తయారుచేస్తున్నారు. నన్నారి షర్బత్‌ను నల్లమల అడవుల్లోని మారేడు గడ్డల నుంచి తయారుచేస్తున్నారు. మారేడుకాయల నుంచి బిల్వ షర్బత్‌ను నల్లమల అడవుల నుంచి సేకరించిన ముడి సరుకుతో తయారు చేస్తున్నారు. ఈ షర్బత్‌లు ఆరోగ్యానికి చలువ చేసే పానీయాలుగా జీసీసీ తయారుచేసి మార్కెటింగ్ చేస్తోంది. జీసీసీ తయారు చేస్తోన్న తేనెకు దేశవ్యాప్తంగా డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.