ఉగ్రవాద నిర్మూలనకు తక్షణం పటిష్టమైన చర్యలను తీసుకోవాలి
పాకిస్థాన్ కు భారత్, అమెరికా సంయుక్తంగా హెచ్చరిక
న్యూఢిల్లీ డిసెంబర్ 20
ఉగ్రవాద నిర్మూలనకు పటిష్టమైన చర్యలను పాకిస్థాన్ తక్షణం తీసుకోవాలని భారత్, అమెరికా సంయుక్తంగా హెచ్చరించాయి. జైషే మహ్మద్, అల్‌ఖైదా, లష్కరే తోయిబా, డీ- కంపెనీ తదితర ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని సూచించాయి. పాక్ భూ భాగంలో ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నాయి. ముంబై, పఠాన్‌కోట్ వంటి దాడులతో సంబంధం ఉన్న ఉగ్రవాదులపై వెంటనే విచారణ జరిపి, వారిని శిక్షించాలని సూచించాయి.కాగా.. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో అమెరికా పాత్రను భారత్ అభినందించింది. ఉగ్రవాదుల నిర్మూలనకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమెరికా స్వాగతించింది. ఉగ్రవాద నిర్మూలనకు పరస్పరం సహకరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. వాషింగ్టన్ వేదికగా భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భారత్ నుంచి విదేశాంగ మంత్రి జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.