ప్రధాని మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు
ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక
న్యూఢిల్లీ డిసెంబర్ 20 ;ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల తాజా సమాచారం. ఈనెల 22న రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో మోదీ పాల్లోనుండటంతో ఆయనను టార్గెట్ చేసేందుకు పాక్ ఉగ్ర సంస్థలు ప్లాన్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇందుకు సంబంధించి స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్, ఢిల్లీ పోలీసులకు ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేశాయి. ఢిల్లీలోని అనధికార కాలనీలను కేంద్రం రెగ్యులరేజ్ చేయనుండటంతో దీనిని హైలైట్ చేసేందుకు బీజేపీ ఈ ర్యాలీని రామ్‌లీలా గ్రౌండ్స్‌లో నిర్వహించనుంది. మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉన్నందున పీఎం రక్షణకు ఉద్దేశించిన బ్లూ బుక్‌లో పేర్కొన్న జాగ్రత్తలన్నీ తూ.చ. తప్పకుండా అమలు చేయాలని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఏజెన్సీలు భద్రతా సంస్థలకు ఆదేశాలిచ్చాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు, మీడియా ప్రతినిధులు రామ్‌లీలా మైదాన్‌కు వచ్చే అవకాశాలున్నాయని, దీనిని ఆసరాగా తీసుకుని పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ దాడులకు పాల్పడొచ్చని ఏజెన్సీలు చెబుతున్నాయి. రామ్‌లీలా మైదానంలో జరుగనున్న ర్యాలీకి భద్రతా ఏర్పాట్లను ఎస్‌పీజీ, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా పర్యవేక్షించనున్నాయి. మోదీతో పాటు ఎన్‌డీఏ ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు ఈ ర్యాలీలో పాల్గోనున్నారు.