రైతుకే పట్టం (తూర్పుగోదావరి)
కాకినాడ, డిసెంబర్ 20 : ఆక్వా జోన్ల పరిధిలో ఉన్న రైతులకే అనుమతులు.. ప్రభుత్వ రాయితీలు అందనున్నాయి.. డాలర్ల పంటగా పేరొందిన ఆక్వా రంగాన్ని క్రమబద్ధీకరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. రాష్ట్రంలో రెండంకెల వృద్ధిరేటు సాధించడంలో ఈ రంగమే కీలకభూమిక పోషిస్తున్నా.. కొన్నిచోట్ల ఆక్వా చెరువుల కారణంగా సారవంతమైన పంట భూములు చౌడుబారుతున్నాయి. ఈ నష్టాన్ని అరికట్టేందుకు సాగును క్రమబద్ధీకరించి ఎవరికీ నష్టం లేకుండా మత్స్యశాఖ అధికారులు జోన్లను ఏర్పాటు చేశారు. ఇకపై వాటి పరిధిలోనే చెరువులు ఉంటాయి. గతంలో మాదిరిగా ఇష్టానుసారంగా తవ్వకాలు చేయడానికి అవకాశం లేదు. జిల్లాలో ఆరేళ్లుగా ఏటా ఆక్వా సాగు పెరుగుతోంది. వరిసాగు గిట్టుబాటు కాకపోవడం, కూలీల కొరత వంటి పరిస్థితుల్లో ఆక్వారంగం వైపు రైతులు మళ్లుతున్నారు. ఓ పద్ధతంటూ లేకుండా ఆక్వా సాగును చేపట్టడంతో.. సారవంతమైన భూములు చౌడుబారుతున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. కొన్ని ప్రతికూల పరిస్థితుల్ల్లో ఆక్వా సాగుదారులు సైతం భారీగా నష్టాలను చవిచూస్తున్నారు. దీనిని నిలువరించడానికి ఆక్వా జోన్ల (మత్స్య మండళ్లు) ప్రక్రియకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నారు. జిల్లాలో 46 మండలాల్లోని 393 గ్రామాల్లో ఆక్వా జోన్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని మత్స్యశాఖ అధికారులు గ్రామసభల ద్వారా గుర్తించారు. వీటికి సంబంధించి ఈ ఏడాది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో అవి అమలులోకి వచ్చాయి. ఈ జోన్ల పరిధిలో ప్రస్తుతం 19,243.53 హెక్టార్లలో ఆక్వాసాగు చేస్తుండగా, మరో 8,395.25 హెక్టార్లలో ఈ తరహా సాగు చేపట్టడానికి అవకాశం ఉన్నట్లు తేల్చారు. ఇకపై వాటి పరిధిలోనే ఆక్వా సాగు చేపట్టాలని నిర్ణయించారు. జోన్ల పరిధిలో లేని భూముల్లో ఇప్పటికే చెరువులు తవ్వి ఆక్వా అక్రమ సాగు ..మిగతా 9లోచేపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా సుమారు మరో 15 వేల హెక్టార్లలో అక్రమ సాగు ఉంటుందని అంచనా. ఇలా గుర్తించిన వాటిలో కాజులూరు, ఉప్పలగుప్తం, తాళ్లరేవు మండలాల్లో అధికారులు సదరు చెరువులకు గండ్లు కొట్టించారు. ఇకపై ఆక్వాసాగుకు మత్స్యశాఖ ధ్రువీకరణ పత్రం లేకపోతే ఇబ్బందులు తప్పవు. జిల్లాలో కాజులూరు, తాళ్లరేవు, అల్లవరం, ఉప్పలగుప్తం, మామిడికుదురు, రాజోలు, కాట్రేనికోన, ఐ.పోలవరం, అమలాపురం, రామచంద్రపురం, సఖినేటిపల్లి, పెదపూడి, కరప, ముమ్మిడివరం, తొండంగి, అయినవిల్లి, మలికిపురం మండలాల్లో ఆక్వాసాగు అధికంగా ఉంది. వీటితో పాటు ఇతర మండలాల్లో సాగులో ఉన్న ఆక్వాచెరువులతో పాటు అక్కడ ఇంకా ఎంత విస్తీర్ణం అనుకూలంగా ఉందనే విషయాలను గ్రామాల వారీగా జోన్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ పరిస్థితులను గ్రామం యూనిట్‌గా పరిశీలన చేశారు. గ్రామ స్థాయిలో నీటి లభ్యత.. జలం లక్షణాలు, ఉదజని సూచిక, ఉప్పదనం, కఠినత్వం, నేల స్వభావం, క్షారత్వం తదితర అంశాలపై మత్స్యశాఖ అధికారులు సర్వే చేపట్టారు. గ్రామ స్థాయిలో ఉపగ్రహ చిత్రాలు సిద్ధం చేసి. గ్రామాల వారీగా గ్రామ సభలను నిర్వహించి జోన్ల ఏర్పాటుకు తుదిరూపునిచ్చి అమలులోకి తీసుకువచ్చారు. ఆక్వాజోన్ల ప్రకారం కొన్ని గ్రామాలు జోన్ల పరిధిలో ఉన్నా.. ప్రస్తుతం ఉన్న సాగు మినహా కొత్తగా చెరువులు తవ్వడానికి అవకాశం లేదు. ఉప్పలగుప్తం, ఆత్రేయపురం, కొత్తపేట, అంబాజీపేట, కరప, ప్రత్తిపాడు, సామర్లకోట, గండేపల్లి, కె.గంగవరం, ఆలమూరు, రాయవరం, బిక్కవోలు, అనపర్తి, కడియం మండలాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా మండలాల్లోని ఏ గ్రామంలోనూ ఆక్వా చెరువుల తవ్వకానికి అవకాశం లేదు. ఆక్వా జోన్లు పరిధిలో ఉన్న భూముల్లో సాగు చేపట్టడానికి సులభంగా అనుమతులు పొందవచ్ఛు విద్యుత్తు కనెక్షన్లకు రూ.లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా రాయితీతో మంజూరు చేయడంతో పాటు.. ప్రభుత్వం ఆక్వా చెరువులకు అందిస్తున్న విద్యుత్తు రాయితీ పొందుతారు. సాగు చేపడుతున్న ప్రాంతాల్లో స్థానికంగా ఆక్వా టెక్నీషియన్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఎగుమతులకు కావాల్సిన శీతల గిడ్డంగులు అందుబాటులోకి తేనున్నారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఎగుమతుల ప్రక్రియను సులభతరం చేసి.. స్థానికంగా మార్కెట్ సౌకర్యాన్ని కల్పించనున్నారు.