YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విద్య-ఉపాధి తెలంగాణ

రక్షణ.. శిక్షణ (ఖమ్మం)

రక్షణ.. శిక్షణ (ఖమ్మం)

రక్షణ.. శిక్షణ (ఖమ్మం)
ఖమ్మం, డిసెంబర్ 20 : నేటి తరం బాలికలు చిన్నపాటి సమస్యలకే బెంబేలెత్తిపోతున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లే మార్గంలోనో, వాహనంలోనే, తరగతి గదుల్లోనే ఎదురయ్యే వేధింపులు వారిని మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నాయి. పలు ఘటనలు బాధితులు ఎంతో కుంగిపోయేలా చేస్తుండటంతో పాటు ఏకంగా చదువుకే దూరమైపోయేలా చేస్తున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా బాలికల్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని ప్రత్యేక శిక్షకుని ఆధ్వర్యంలో వారికి ఆత్మ రక్షణ విద్యలను నేర్పించాలని ఇటీవల ఆదేశించింది. ఇందుకోసం జిల్లాలోని 59 పాఠశాలలను ఎంపిక చేశారు. ఖమ్మం జిల్లాలో 284 ప్రాథమికోన్నత, 461 ఉన్నత పాఠశాలలున్నాయి. వేలాది మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న వారిలో తరచూ ఎవరో ఒకరు వేధింపులకు గురవుతున్నారు. దీనికి తోడు ప్రస్తుత సమాజంలో చోటుచేసుకుంటున్న మహిళా వ్యతిరేక నేరాల ప్రభావం చాలా మందిపై ఉంది. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతోనే అను నిత్యం పాఠశాలలకు రాకపోకలు సాగిస్తున్నవారెందరో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కి.మీ.ల దూరం ఒంటరిగా ప్రయాణం చేయలేక కొందరు విద్యకే దూరమవుతున్న వైనం నెలకొంది. అలాంటి బాలికల్లో భయాన్ని పారదోలేందుకు ఏకైక మార్గం.. ‘రక్షణ’ విషయంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనేలా వారిని తీర్చిదిద్దాలి. అందుకు విద్యాలయాలే వేదిక కావాలి. ఈ ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు డిసెంబరు నుంచి కరాటే, కుంగ్‌ఫూ, జూడోల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మానసికంగా, శారీరకంగా వారిని దృఢంగా తయారు చేయాలని, ఆకతాయిల ఆగడాల నుంచి తమను తాము రక్షించుకోగలిగేలా చూడాలని భావిస్తోంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 461కు గాను 59 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు 3 నెలల పాటు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వనున్నారు. 100 మంది బాలికలు (ప్రాథమికోన్నత కలిపి) ఉన్న ఈ పాఠశాలలకు ప్రత్యేక శిక్షకులను నియమిస్తారు. వారానికి రెండు రోజులు మధ్యాహ్నం వేళ విద్యార్థినులకు మెలకువలు నేర్పిస్తారు. రెండు క్లాస్‌ల చొప్పున ప్రతి క్లాస్‌కు గంటపాటు శిక్షణ ఇవ్వాలి.  ‘ఆత్మరక్షణ’ విద్యలో ప్రావీణ్యం ఉన్నవారిని శిక్షకునిగా ఎంపిక చేసి వారితో విద్యార్థినులకు శిక్షణ ఇప్పించనున్నారు. కొన్ని పాఠశాలల్లో తరగతులు ఇప్పటికే ప్రారంభించగా చాలా చోట్ల శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షకుడికి నెలకు రూ.3 వేలు చొప్పున 3 నెలలకు రూ.9 వేలు ఇవ్వనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలను ముదిగొండ, కొణిజర్ల, కారేపల్లి, కామేపల్లి, రఘనాథపాలెం, ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, చింతకాని, ఖమ్మం అర్బన్‌, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, తల్లాడ, వైరా, బోనకల్లు, మధిర మండలాల్లో ఉన్నాయి. మొత్తమ్మీద సుమారు 6 వేల మంది విద్యార్థినులకు ‘ఆత్మరక్షణ విద్య’లను పరిచయం చేయనున్నారు. శిక్షణ పూర్తయ్యాక విద్యార్థినులు తాము నేర్చుకున్న మెలకువలను ప్రదర్శించి చూపుతారు.

Related Posts