ఉల్లికోసం తోపులాట...పలువురికి గాయాలు
నెల్లూరు, డిసెబంర్ 20,
నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సబ్సిడీ ఉల్లి విక్రయ కేంద్రంలో జరిగిన ,తోపులాటలో పలువురు గాయపడ్డ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. సబ్సిడీ ఉల్లి కోసం ఉదయం 7 గంటలకు వందలాది మంది కేంద్రం వద్దకు చేరుకున్నారు. అందరూ గేటు బయట వేచిఉన్నారు. పోలీసులు క్యు పద్దతి పాటించాలని ఎంత వాదించినా వీలు కాలేదు. 9 గంటల సమయంలో గేటు తీయడంతో ఒక్క సారిగా జనం ఎగబడ్డారు. దీంతో తోపులాట జరిగి చాల మంది కింద పడిపోయారు. కమలమ్మ అనే మహిళకు తలకు గాయమైంది అనేక మంది తోపులాటలో గాయపడ్డారు. దీంతో గాయపడ్డ వారికి స్ధానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తోపులాట నేపధ్యంలో ఉల్లి విక్రయాలను నిలిపివేశారు. మధ్యాహ్నం తర్వాత పోలీసు బందోబస్తు నడుమ విక్రయాలను జరిపారు.ముందస్తు చర్యలు తీసుకోకపోవడమే తోపులాటకు కారణమని స్థానికులు ఆరోపిస్తూన్నారు.