ఉన్నావ్ కేసు
జీవిత ఖైదు.. కోటి రూపాయిల జరిమానా
న్యూఢిల్లీ, డిసెంబర్ 20,
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ రేప్ కేసులో ఢిల్లీలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దోషిగా తేలిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవితఖైదు విధిస్తూ తుదితీర్పు వెలువరించింది. ఈ కేసులో కుల్దీప్‌ను రెండ్రోజుల క్రితమే దోషిగా న్యాయస్థానం తేల్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిశీలించి తీర్పు చెప్పేందుకు కోర్టు కాస్త సమయం తీసుకుంది. చివరికి కుల్దీప్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.25లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. జరిమానాలో రూ.10లక్షలను బాధితురాలికి అందజేయాలని ఆదేశించింది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 2017లో జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఉద్యోగం కావాలంటూ వెళ్లిన 17 ఏళ్ల మైనర్ బాలికపై 2017 జూన్ 4 బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేసినట్టు ఆరోపణ వచ్చింది. 2018 ఏప్రిల్ 3న బాధితురాలి తండ్రిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. దీనికి తోడు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో ఆయన్ని తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపించారు. మరోవైపు సెంగార్‌పై కేసు నమోదు చేయకపోవడంతో బాధితురాలు తన కుటుంబ సభ్యులతో లక్నో వెళ్లి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం ముందు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ తర్వాతి రోజే ఆమె తండ్రి పోలీసు కస్టడీలో ఉన్న అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 13న సెంగార్‌ను అరెస్ట్ చేశారు. జులై 28న విచారణ నిమిత్తం బాధితురాలు కారులో కోర్టుకు వెళ్తుండగా ఓ నంబరులేని లారీ దాన్ని ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న బాధితురాలికి బంధువులైన ఇద్దరు మహిళలు మృతి చెందగా, న్యాయవాది, బాధితురాలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కేసు విచారణను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. ఆగస్టు 5 నుంచి రోజువారీ విచారణ జరిపిన ఢిల్లీ జడ్జ్ ధర్మేష్ శర్మ సోమవారమే కుల్దీప్‌ను దోషిగా నిర్ధారించారు. మరో నిందితుడు శశి సింగ్‌ను న్యాయస్థానం నిర్ధోషిగా తేల్చింది. కోర్టు తీర్పు తర్వాత సెంగార్ బోరున విలపించారు.. ఎన్ని అవాంతరాలు వచ్చినా న్యాయం కోసం ధైర్యంగా నిలబడిన బాధితురాలు చివరికి ఆ కామాంధుడికి శిక్ష పడేలా చేసింది.