రాజధాని రచ్చతో చీలిన టీడీపీ
విజయవాడ, డిసెంబర్ 20,
ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు వైఎస్ జగన్ చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ ఉండొచ్చని జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల.. రాజకీయంగా దుమారం రేగుతోంది. పార్టీల వారీగా కాకుండా ప్రాంతాల వారీగా నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు.. జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.చాలా మంది బీజేపీ నేతలు కూడా జగన్ నిర్ణయాన్ని పాక్షికంగా సమర్థిస్తున్నారు. జగన్ నిర్ణయాన్ని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ స్వాగతించారు. మూడు రాజధానుల విషయమై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి గానీ.. పరిపాలన వికేంద్రీకరణ కాదన్నారు. అమరావతి సీడ్ క్యాపిటల్‌లో పూర్తి శాసన, పరిపాలన వ్యవస్థ & హైకోర్టు బెంచ్ ఉండాలన్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖ ఎదగడానికి ప్రోత్సాహకాలు అందజేయాలని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ద్వారా అభివృద్ధి వికేంద్రీకరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. సుజనా చౌదరి మాత్రం రాజధానిని మార్చడం అంత తేలికైన పని కాదన్నారు.ఇక టీడీపీ విషయానికి వస్తే.. నాయకులు ప్రాంతాల వారీగా చీలిపోయారు. జగన్ మూడు రాజధానులు ఉండొచ్చని ప్రకటన చేయగానే.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రాష్ట్రం నష్టపోతుందన్నారు. సీఎం ఎక్కడుంటారని ఆయన ప్రశ్నించారు. తాను కేంద్రానికి ఫిర్యాదు చేస్తానన్నారు. రాష్ట్రం పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేశారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇది నిజమైతే టీడీపీ నేతలకు జగన్ నిర్ణయం ఆర్థికంగా షాకిచ్చేదే.టీడీపీ నేతలు మాత్రం ప్రాంతాల వారీగా చీలిపోయారు. కేఈ కృష్ణమూర్తి, కొండ్రు మురళీ, గంటా శ్రీనివాసరావు తదితరులు జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు నిర్ణయాన్ని కేఈ స్వాగతించగా.. వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును కొండ్రు మురళీ, గంటా శ్రీనివాసరావు స్వాగతించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే.. రాజధానిని నాశనం చేసి.. రాజధానులను వికేంద్రీకరించడం కాదన్నారు.జగన్ వ్యాఖ్యల పట్ల అమరావతి ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రాజధానికి భూముులు ఇచ్చిన రైతులు అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు. వైజాగ్, కర్నూలు ప్రాంత ప్రజలు సహజంగానే స్వాగతిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు కూడా జగన్ చేసిన వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించలేని పరిస్థితి. అంతేకాదు.. జగన్ చేసిన ప్రకటనను పార్టీ అధినేత చంద్రబాబు ఖండించినప్పటికీ.. గట్టిగా వ్యతిరేకిస్తే.. ఈ ప్రాంతాల ప్రజలకు పార్టీ ఎక్కడ దూరం అవుతుందోననే భయం ఆయనలోనూ ఉంది. రాజధాని వికేంద్రీకరణ గురించి టీడీపీ శ్రేణులు ప్రజలకు అర్థమయ్యేలా ఎలా వివరిస్తాయనేది ఆసక్తికరం. జనం సహజంగానే తమ ప్రాంతం డెవలప్ కావాలని కోరుకుంటారు కాబట్టి.. ఇది ఒకింత కష్టమే.అభివృద్ధి వికేంద్రీకరణ పట్ల జగన్ సర్కారు నిర్దిష్టమైన వ్యూహంతో ముందుకెళ్తోందని వైఎస్సార్సీపీ శ్రేణులు చెబుతున్న మాట. శ్రీకాకుళంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్, విజయనగరంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, తూర్పుగోదావరిలో పెట్రో సెజ్, పశ్చిమగోదావరిలో పోలవరం ప్రాజెక్ట్, కృష్ణా జిల్లాలో బందర్ పోర్టు, గుంటూరు జిల్లాలో అసెంబ్లీ, ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్ట్, నెల్లూరు-చిత్తూరు జిల్లాల్లో బీహెచ్ఈఎల్ ఏర్పాటు, అనంతపురంలో రాడార్ యూనిట్, కర్నూలులో హైకోర్టు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా.. ప్రతి జిల్లాను అభివృద్ధిపథంలో నడపొచ్చని జగన్ భావిస్తున్నారట. తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన ఉంటుందంటున్నారు.అమరావతిలో పరిపాలన ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇప్పుడిప్పుడే రాజధాని ప్రాంతానికి అలవాటుపడుతున్నారు. వారి పిల్లల్లు కూడా రాజధాని ప్రాంతంలో విద్యాలయాల్లో చేరారు. వాళ్ళని మళ్ళీ ఎగ్జిక్యూటివ్ రాజధాని అని మరోచోటికి వెళ్లిపోమంటే ఎలా?అంటూ ట్వీట్ చేశారు