Highlights
- తిన్నామా..
- పడుకున్నామా..
- తెల్లరిందా..!
- సాయాజీ షిండే
తిన్నామా.. పడుకున్నామా.. తెల్లరిందా.. అని కాకుండా ప్రతి ఒక్కరూ సమాజం కోసం ఏదో ఒక మంచి పని చేయాలి.మంచి ఆహారం కోసం మనిషి శోధిస్తున్నాడు. ఆరోగ్య వంతమైన జీవనం కోసం మనిషి పరితపిస్తున్నాడు. డబ్బు సంపాదన ఒక్కటే లక్ష్యంగా కాకుండా జీవన ప్రమాణాల్ని పెంపొందించుకోవడం కోసం ఎంత దూరమైన ప్రయాణం చేస్తున్నాడు. కానీ అవెక్కడ దొరుకుతాయి. నేనూ ఓ ఆరోగ్య అన్వేషిణే. అందుకే హైదరాబాద్‌కి వచ్చినప్పుడల్లా నగరంలోని కొన్నిస్టోర్‌లను సందర్శిస్తాను. నేను మంబయిలో నివసిస్తున్నా... నెయ్యిని హైదరాబాద్ నుంచే కొనుగోలు చేసి తీసుకెళ్తా. దాని కోసమే బుధవారం బంజారాహిల్స్‌లోని ఎమరాల్డ్ స్టోర్‌ని సందర్శించా. అక్కడో సాధారణ వ్యక్తి సాంబారు అన్నం వడ్డిస్తూ ఎలా ఉంది అయ్యా..! అంటూ వినియోగదారుల్ని ఆత్మీయంగా పలకరిస్తున్నారు. అందులో వాడిన బియ్యం రకాన్ని... వాటి వల్ల కలిగే ప్రయోజనాల్ని వివరిస్తున్నారు. నా దృష్టి ఆయనపై పడింది. ఎంటీ ప్రత్యేకం అంటూ ఆ వ్యక్తితో నేనూ మాట కలిపాను. ఈ బియ్యం పేరు రాంబోగ్ అని చెప్పారు. ప్రత్యేకతల్ని వివరించారు. స్టోర్‌లో ఉండే బియ్యం రకాల ప్రత్యేకతల్నికూడా వివరించారు. రేపు ఉదయాన్నే రండి. మీకు ఓ ప్రత్యేక రకపు బియ్యంతో భోజనం ఏర్పాటు చేస్తాం. అని ఆత్మీయంగా ఆహ్వానించారు. నాతో మాట్లాడిన వ్యక్తి పేరు విజయ్‌రామ్ అని... ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. ప్రచారం చేస్తున్నారని తరువాత తెలుసకున్నా. వారి ఆహ్వానం గురువారం స్టోర్‌ను సందర్శించా. చాలా ప్రాచీన కాలం నాటి దేశీ విత్తనపు రకం అది. దాని పేరు నవ్వారా. 12 గంటలు నానబెట్టి ప్రత్యేక విధానంలో వండి పెరుగుతో కలిపి వడ్డించారు స్టోర్ సిబ్బంది. తినే ముందు ఒక షరుతు పెట్టారు. 32 సార్లు నమిలి మింగాలని. నిజమే. అసలు మనం ఆహారాన్ని నములుతున్నామా. నెమరు వేస్తున్నామా. అంతా పాలిష్ మాయలో పడి ఏదేదో తినేస్తున్నామని అనిపించింది. కేవలం నాలుగుముద్దలు తినగానే కడుపు నిండిపోయింది. చాలా హాయిగా అనిపించింది. ప్రాచీన కాలం నాటి దేశీ విత్తనం రుచిని తొలిసారి ఆస్వాదించా. అద్భుతం. ఆహా.. అనిపించేలా ఉంది. అంతరించిపోతున్న దేశీ విత్తనాల్ని పరిరక్షించేందుకు ఉద్యమిస్తున్న ఆ వ్యక్తికి హృదయపూర్వక ధన్యవాదములు.
- మీ సాయాజీ షిండే
ఎవరీ షిండే...
షిండే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. డిగ్రీ తరువాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్లో వాచ్‌మెన్‌గా చేరారు. నెల జీతం 165 రూపాయలు. ఉద్యోగం చేస్తున్నా మనసంతా నాటకాలపైనే ఉండేది. ఒక పెద్దాయన ఇచ్చిన సలహాతో వ్యాయామం, యోగా అలవాటు చేసుకుని దేహధారుడ్యాన్ని పెంపొందించుకున్నారు. నటనకు సంబంధించి ఎన్నో పుస్తకాలను చదివారు. ధార్మియ అనే మరాఠీ నాటకంలో షిండే చేసిన హిజ్రా పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది.
స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది. చాలామంది షిండేను నిజమైన హిజ్రా అనుకున్నారు. దాంతో ప్రముఖల దృష్టిలో పడిన షిండేకు ఎన్నో మరాఠీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. 2000 సంవత్సరంలో వచ్చిన భారతి అనే తమిళ సినిమాలో ప్రఖ్యాత కవి సుబ్రమణ్య భారతిగా నటించి దక్షిణాది సినీ పరిశ్రమకు దగ్గరయ్యాడు. ఠాగూర్ సినిమాలో బద్రీ నారాయణ, వీడే సినిమాలో బత్తుల బైరాగి నాయుడు పాత్రలు మొదట్లో అతనికి పేరు తెచ్చిన పాత్రలు. పోకిరీ సినిమాలో తిన్నమా పడుకున్నామా తెల్లారిందా అనే డైలాగ్ పేరుతెచ్చింది.
---సినీ విశ్లేషకులు కదిరి రాజా