చెట్టు నరికినందుకు 45 వేలు ఫైన్
మెదక్, డిసెంబర్ 21,
సిద్దిపేటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడానికి మంత్రి హరీశ్ రావు సంకల్పించారు. అధికారులు, ప్రజల చొరవతో సరికొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు. పారిశుధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పట్టణంలో మొక్కలు, చెట్ల సంరక్షణ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ‘మొక్కలు నాటండి - పర్యావరణాన్ని కాపాడండి’ అంటూ పిలుపునిస్తున్నారు. అయితే.. పట్టణానికి చెందిన కొంత మంది ఎవరూ చూడకుండా చెట్లు నరికేశారు. కానీ, వారి పప్పులుడకలేదు.సిద్దిపేటకు చెందిన కొంత మంది వ్యాపారులు చడీ చప్పుడు లేకుండా రోడ్డు పక్కన ఉన్న కొన్ని చెట్లను నరికేయించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరూ చూడని సమయంలో చెట్లను నరికేయించి తప్పించుకుందామనుకున్నారు. కానీ, సీసీటీవీ కెమెరాల ముందు వారి పప్పులు ఉడకలేదు. నిందితులను పట్టుకున్న అధికారులు మంత్రి హరీశ్ రావు నిర్దేశాల మేరకు భారీ జరిమానా విధించారు.సిద్దిపేట పట్టణంలో కొత్త బస్టాప్ సమీపంలో హైదరాబాద్ రోడ్‌లో కొంత మంది గుట్టుచప్పుడు కాకుండా నాలుగు చెట్లు నరికేసినట్లు ఆర్టికల్చర్ అధికారి ఐలయ్య శుక్రవారం గుర్తించారు. నిందితుల వివరాలు తెలియకపోవడంతో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. శుక్రవారం వేకువజామున 3.45 గంటల సమయంలో ఆ చెట్లను నరికేసినట్లు గుర్తించారు
సీసీటీవీ కెమెరాల ఆధారంగా అధికారి ఐలయ్య నిందితులను గుర్తించి విచారించారు. 8 సంవత్సరాల వయసున్న 4 చెట్లను ఎవరి కంటా పడకుండా నరికేసినట్లు విచారణలో తేలింది. శివమ్స్ గార్డెన్ సమీపంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు రోడ్డుపై ఏర్పాటు చేసిన హోర్డింగ్ కనిపించడం లేదని ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్లను నరికేయించారు. మునిసిపల్ ఛైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల అనుసారం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులకు రూ.45,000 జరిమాన విధించినట్లు ఆర్టికల్చర్ అధికారి ఐలయ్య తెలిపారు.సిద్దిపేట పట్టణంలో ఎవరైనా చెట్లను గానీ, మొక్కలను గానీ నరికేసినా, ధ్వంసం చేసినా వారిపై శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. పట్టణాన్ని హరిత సిద్దిపేటగా మార్చడం మంత్రి హరీశ్ రావు లక్ష్యమని.. ఇందులో భాగంగా పట్టణంలోని అన్ని వార్డులు, ప్రధాన రహదారుల్లో మొక్కలను నాటి రోజూ నీరు పోసి సంరక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు.ఈ ఘటన ద్వారా హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చెట్లకు ఇస్తున్న ప్రాధాన్యం హాట్ టాపిక్‌గా మారింది. ‘దటీజ్ హరీశ్ అన్న’ అంటూ అభిమానులు జేజేలు పలుకుతున్నారు. సదరు షాపింగ్ మాల్.. మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగానే ప్రారంభమైందని, తప్పు చేస్తే ఎలాంటి వారినైనా ఆయన వదిలిపెట్టరని గర్వంగా చెబుతుండటం గమనార్హం.