YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అన్నదాత వ్యధ (పశ్చిమగోదావరి)

అన్నదాత వ్యధ (పశ్చిమగోదావరి)

అన్నదాత వ్యధ (పశ్చిమగోదావరి)
ఏలూరు, డిసెంబర్ 21 కష్టాలు, అప్పులు, ప్రకృతి వైపరీత్యాలు ముప్పేట దాడి చేసినా  తట్టుకుంటూ ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్న తీరా అమ్ముకునేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. వీటికి తోడు వాతావరణ మార్పులు, దళారుల వైఖరి వారికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లాలోని చాలా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లలో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో రైతులకు అవస్థలతోపాటు నష్టాలు తప్పడం లేదు. ఇటీవల జంగారెడ్డిగూడెం ఏఎంసీ, ఇదే మండలంలోని శ్రీనివాసపురం, దేవులపల్లి, పంగిడిగూడెం, గురవాయిగూడెం తదితర కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యల కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు, రవాణా జరగాలంటే ట్రక్‌షీట్‌ తప్పనిసరి. కంప్యూటర్ల మొరాయింపు వల్ల అది ఇవ్వటం వీలు కావటం లేదు. దానికి ప్రత్యామ్నాయంగా కేంద్రాల్లో సిబ్బంది ఇచ్చే రసీదును చూపాలని అధికారులు సూచించారు. దీన్ని చూపినా చాలా చెక్‌పోస్టుల్లో సరకును వదలటం లేదు. రాతపూర్వకంగా ఇచ్చే రశీదులు చెల్లుబాటు కావంటూ నగదు వసూలు చేస్తున్నారు. రైతుల ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ధరకంటే తక్కువకు కొనుగోలు చేసేందుకు దళారులు రైతుల చుట్టూ తిరుగుతున్నారు. చాలామంది రైతులు ధాన్యాన్ని ఆరుబయటే ఆరబెడుతున్నారు. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో వారు కంగారు పడుతున్నారు. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా వెలుగు, పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని కొనేందుకు మిల్లర్లు ముందుకు రాని పరిస్థితి. వచ్చినా స్వర్ణ, సంపత్‌ స్వర్ణ, 1121, పీఎల్‌ వంటి రకాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. వాటిని కూడా రోజుకు ఒక లారీ మినహా కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. అదేవిధంగా 1075, 1056, 1001, వంటి రకాల ధాన్యంలో 60 శాతం వరకూ నూక వస్తుందనే సాకుతో వాటి కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేశారు. ఇలాంటి ధాన్యాన్ని బాయిల్డ్‌ మిల్లుల్లో కొనుగోలు చేయాలి. నూక శాతం ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రూ. 100 నుంచి రూ. 150 వరకూ తక్కువకు అమ్మాలని మిల్లర్లు బేరాలాడుతున్నారు. దీంతో వీటిని పండించిన రైతులు ధాన్యం నిల్వ చేయలేక, అమ్మలేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Related Posts