YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కష్టాలన్నీ రైతుకే.. (కరీంనగర్)

కష్టాలన్నీ రైతుకే.. (కరీంనగర్)

కష్టాలన్నీ రైతుకే.. (కరీంనగర్)
కరీంనగర్, డిసెంబర్ 21 : పండించిన పంటను అమ్ముకోవాలన్న అన్నదాతకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రభుత్వం పండించిన ప్రతి గింజను కొంటానంటూ భరోసా ఇచ్చినా.. కొనుగోలులో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అతివృష్టితో పంట తడిసి, మొలక వచ్చి.. దోమపోటుకు నాణ్యత కోల్పోయి ధాన్యం దిగుబడి తగ్గి రైతులు నష్టపోయారు. మిగిలిన ధాన్యాన్ని అయినా విక్రయించాలనుకునే రైతుకు కొనుగోలు కేంద్రాల్లో నిరాశే మిగులుతోంది. రంగు మారిందంటూ, నాణ్యత లేదంటూ మిల్లులో దించుకోవడానికి తిరస్కరిస్తున్నారు. గంగాధర మండలం మంగపేట రైతులకు సంబంధించిన 150 బస్తాల ధాన్యం నాణ్యత లేదంటూ మిల్లర్లు వెనక్కి పంపారు. ధాన్యంలో తాలు, మట్టి ఉందంటూ సాకులుచెబుతూ కొనుగోళ్లకు మొగ్గుచూపడంలేదు. ఈ సమస్యలు నెల రోజులుగా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నా ప్రభుత్వం పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. ధాన్యంలో తాలు ఎక్కువగా ఉందంటూ మిల్లర్లు కొనుగోళ్లను తిరస్కరిస్తున్నారు. రైతులు పంట కోసి కళ్లం చేసి ధాన్యాన్ని తూర్పార పట్టి తాలు తొలగించేవారు. ప్రస్తుతం వరికోత యంత్రాలు రావడంతో పంటను కోసి నేరుగా ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ధాన్యాన్ని మార్కెట్‌లో ఆరబెడుతున్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడి క్లీనర్‌ యంత్రాలను అందుబాటులో పెట్టారు. ఐకేపీ, ప్యాక్స్‌ తదితర కేంద్రాల్లో ఇవి అందుబాటులో లేవు. కొన్ని కేంద్రాల్లో యంత్రాలు ఉన్నా తుప్పు పట్టిపోయాయి. దీంతో రైతులు తాలు, మట్టి, ఇసుకను జల్లెడ పట్టి శుభ్రం చేసే అవకాశం లేదు. రాష్ట్రంలో నిజామాబాద్‌ తర్వాత అత్యధికంగా కరీంనగర్‌లోనే వరి పండుతుందని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఈ అంచనాకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజా పంపిణీకి బియ్యం కొనుగోలు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ జిల్లాలకు రా రైస్‌ అలాట్‌మెంట్‌ను చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 6,04,681 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపణీకి 2,00,681 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఎఫ్‌సీఐ రా రైస్‌ ‘సున్న’ లక్ష్యంగా నిర్ధేశించింది. ఇదే సమయంలో కరీంనగర్‌ జిల్లాలో 4,85,794 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఊహించిన ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రంపిణీకి 60,332 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయడానికే మొగ్గుచూపారు. మిగతాది ఎఫ్‌సీఐ సంస్థ 1,51,168 మెట్రిక్‌ టన్నులు కొనాల్సిందిగా వారికి బాధ్యత అప్పగించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 1,77,005 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే ప్రజా పంపిణీ కోసం 50,250 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయడానికి నిర్ణయించారు. ఇక్కడ ఎఫ్‌సీఐ సంస్థకు కేటాయింపులు ఇవ్వలేదు. అంటే జీరో లక్ష్యమన్నమాట. అధిక దిగుబడి వచ్చిన కరీంనగర్‌, తక్కువ దిగుబడి వచ్చిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాను ఒకే గాటనకట్టారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్తు సరఫరా చేయడంతో గత రబీలో వరిని అత్యధికంగా సాగు చేశారు. దీంతో 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. రబీకి సంబంధించిన ధాన్యం ఫారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లుల్లో ఉండిపోయింది. సుమారు 90 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లుల్లో నిల్వ ఉంది. ఎఫ్‌సీఐ గోదాంలలో 5.30 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వ సామర్థ్యం ఉంటే సుమారు 4.80 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం. ఫారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు మర ఆడించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాంలో నిల్వ చేసేందుకు స్థలం లేదు. మరి కొత్తగా ఖరీఫ్‌లో వచ్చిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేస్తారో మరి.! ఎఫ్‌సీఐ గోదాంలో ఉన్న బియ్యాన్ని తరలించాలంటే గూడ్స్‌ రైలు అవసరం.. గూడ్స్‌ రైలును దక్షిణ మధ్య రైల్వే కేటాయించడానికి మొగ్గుచూపడంలేదు.. యూరియా తీసుకువచ్చే రైలునే బియ్యం నిల్వలను తరలించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ యూరియా నెలకు రెండు, మూడుసార్లకు మించి రావడంలేదని వ్యాపారులు అంటున్నారు. ఈ సమస్యలను ప్రభుత్వ అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదు. జిల్లాలో పండిన పంటను ఎక్కువ మొత్తంలో ప్రజా పంపిణీకి ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఎఫ్‌సీఐకి వదిలేశారు. అంతిమంగా అన్నదాతకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

Related Posts