ఎర్రగడ్డ కు రోగుల తాకిడి
హైద్రాబాద్, డిసెంబర్ 21,
ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు మానసిక రోగుల తాకిడి పెరిగిపోతోంది. రోజూ 300 నుంచి 400 మంది దాకా పేషెంట్లు వస్తున్నారు. అందులో కొత్తవాళ్లు సగటున 40 మంది దాకా ఉంటున్నారు. ఏడాదికి సగటున 12 వేల మంది రోగులు ట్రీట్మెంట్ కోసం వస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అందులో 7 నుంచి 8 వేల మంది తెలంగాణ వాళ్లే కాగా, 4 వేల నుంచి 5 వేల మంది దాకా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పేషెంట్లు ఉంటున్నారు. ఒత్తిడి, తీవ్రమైన మానసిక సమస్యలతో ఆస్పత్రికి వస్తున్నవాళ్లే ఎక్కువుంటున్నారు. సుమారు 50 శాతం మంది జెనిటికల్ సమస్యల వల్లే మానసిక సమస్యల బారిన పడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. వాళ్లలోనూ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువుగా ఉంటున్నారంటున్నారు. ప్రవర్తనలో మార్పులు కనిపించినా, చాలా రోజుల వరకూ డాక్టర్ దగ్గరకు వెళ్లకపోవడం, రకరకాల నమ్మకాలతో లేట్ చేయడం వల్ల చాలా మంది మతిస్థిమితం కోల్పోతున్నారు.డోపమైన్, సెరటోనిన్, నార్ఎపినెఫ్రిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల అసమతులత్య వల్ల మానసిక సమస్యలొస్తాయని నిపుణులు చెబుతున్నారు. మన కదలికలు, ఆలోచనలు అన్నింటిని కంట్రోల్ చేసేందుకు ఈ న్యూరోట్రాన్స్మిటర్లే కణాల మధ్య కమ్యూనికేటర్లుగా పనిచేస్తాయని, ఒత్తిడికి గురైనప్పుడు వాటి స్థాయులు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంటుందని అంటున్నారు. దీంతో ఆలోచనలు, చేతలు, ప్రవర్తన అదుపు తప్పుతాయని చెబుతున్నారు. ఇంట్లో ఎవరికైనా ఇదివరకే మానసిక సమస్యలున్నా, జెనెటికల్ సమస్యలున్నా మానసిక సమస్యలు వచ్చే అవకాశం 10 శాతం వరకు ఉంటుందని సైకియాట్రిస్ట్ డాక్టర్ సుధారాణి చెప్పారు. 15 నుంచి 30 ఏండ్ల వయసు వారే ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు.మానసిక సమస్యలతో బాధపడేవారు 3 రకాలుగా ఉంటారని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. తమను తామే తిట్టుకోవడం, అన్నింటికి తామే కారణమని ఆత్మహత్యలకు ప్రయత్నించడం ఒక రకం. తమను ఎవరో ఏదో చేస్తున్నారని, కొడుతున్నారని, తిడుతున్నారని, చంపడానికి వస్తున్నారని భయపడేటోళ్లు మరో రకం. దాన్నే షీజోఫ్రీనియా అంటారు. ‘ఏదైనా చేయగలం, నేనే గొప్ప, ప్రపంచానికి రాజు నేనే’ అన్నట్టు ప్రవర్తించే వాళ్లు మరో రకం. దీన్ని బైపోలార్ మెంటల్ ఇల్నెస్ అంటారు. జెనెటికల్ సమస్యలు ఉన్నవాళ్లలో షీజోఫ్రీనియా, బైపోలార్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో 30 శాతం మంది మందులు వాడినా పూర్తిగా కోలుకోలేరని అంటున్నారు.