వర్శిటీలకు పాలక మండళ్లు
హైద్రాబాద్, డిసెంబర్ 21,
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం దృష్టి సారించింది. తొమ్మిది వర్సిటీలకు కొత్తగా పాలకమండళ్లు నియామకానికి రంగం సిద్ధమవుతున్నది. త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశమున్నది. ఈ దిశగా విద్యాశాఖ అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఉన్నత విద్యామండలి నెల రోజుల కిందే ఈసీ సభ్యులకు సంబంధించిన పేర్లను వర్సిటీల వారీగా రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన విషయం తెలిసిందే. ఈ పేర్లపైనా అధికారులు పరిశీలిస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉండడంతో కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. దీనిపైనా పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మిగిలిన ఉస్మానియా, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్టీయూహెచ్, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ పాలకమండళ్ల నియామకంపై అధికారులు నిమగమయ్యారు. సంప్రదాయ విశ్వవిద్యాలయాల పాలకమండలిలో మొత్తం 13 మంది సభ్యులుంటారు. ఇందులో ఆ వర్సిటీ వీసీ, ఆర్థిక, విద్యాశాఖ కార్యదర్శులు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్, ఆ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్, సీనియర్ ప్రొఫెసర్, అధ్యాపకుడు, ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల నుంచి ప్రిన్సిపాల్, అధ్యాపకుడు సభ్యులుగా ఉంటారు. వారితోపాటు విద్యావేత్త, పారిశ్రామికవేత్త, ఏదైనా రంగంలో ప్రముఖుడు, సాంస్కృతిక రంగంలో నిపుణుడిని ప్రభుత్వం నియమిస్తుంది. ఇక అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పాలకమండలిలో తొమ్మిది మంది సభ్యులుంటారు. ఆ వర్సిటీ వీసీ, ఆర్థిక, విద్యాశాఖ కార్యదర్శులు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌తోపాటు ఆ వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్‌తోపాటు వివిధ రంగాల్లో నలుగురు ప్రముఖులను ప్రభుత్వం నియమిస్తుంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 11 మంది సభ్యులుంటారు. ఆ వర్సిటీ వీసీ, ఆర్థిక, విద్యాశాఖ కార్యదర్శులు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌తోపాటు ఆ వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, అనుబంధ కాలేజీ ప్రిన్సిపాల్‌తోపాటు వివిధ రంగాల్లో నలుగురు నిపుణులను ప్రభుత్వం నియమిస్తుంది. జేఎన్టీయూహెచ్, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ పాలకమండలిలో 13 మంది సభ్యులుంటారు. ఆ వర్సిటీ వీసీ, ఆర్థిక, విద్యాశాఖ కార్యదర్శులు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌తోపాటు ఆ వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, అనుబంధ కాలేజీ ప్రిన్సిపాల్, ఆ వర్సిటీలో అధ్యాపకుడు, అనుబంధ కాలేజీ అధ్యాపకునితోపాటు వివిధ రంగాల్లో నలుగురు నిపుణులను ప్రభుత్వం నియమిస్తుంది. రెండు, మూడు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశమున్నది.