ఇరిగేషన్ ఇంజినీర్ ఇంటిపై ఏసీబీ దాడులు
కాకినాడ డిసెంబర్ 21
ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించారనే సమాచారంతో జిల్లా నీటిపారుదల శాఖ ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్‌లో పర్యవేక్షక ఇంజినీర్ నల్లం కృష్ణారావుపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో రాష్ట్రంలో ఆరు చోట్ల, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లోని బంధువుల ఇళ్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 15 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. కాకినాడ సర్పవరం జంక్షన్ సమీపంలోని పాతగైగోలుపాడు సుందర్‌నగర్‌లో ఉన్న కృష్ణారావు ఇంటిలో, ఆయన బంధువులు, సహచరుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలను చేపట్టారు. ఆయన సొంత ఊరైన భీమవరంలో, ఆయన నివాసం ఉంటున్న కాకినాడలో, పని చేస్తున్న ధవళేశ్వరంలో, అనకాపల్లిలోని ఆయన అల్లుని ఇంటిపైన, రాజమహేంద్రవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలతో పాటు హైదరాబాద్‌లోను దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ. ఐదు కోట్లకు పైగా ఆస్తులను, పెద్ద మొత్తంలో నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ప్రామిసరీ నోట్లు, స్థలాల దస్తావేజులతో పాటు 68 లక్షల బ్యాంక్ డిపాజిట్లను గుర్తించారు. వీటి విలువ మార్కెట్ రేటు ప్రకారం 3 కోట్ల 35 లక్షల 42వేల 961 అని, బహిరంగ మార్కెట్ రేట్ల ప్రకారం 15 కోట్లు పైబడి ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు.