Highlights
- బీఎస్‌ఈ సెన్సెక్స్ 32,597,
- నిఫ్టీ 9,998 పాయింట్ల వద్ద ముగిశాయి.
ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.వరుసగా నాలుగో వారం కూడా సూచీలు నష్టపోయాయి. ఈ వారంలో సెన్సెక్స్ 579 పాయింట్లు (1.75%), నిఫ్టీ 197 పాయింట్లు(1.93%) చొప్పున నష్టపోయాయి. ఈ నెల 15 ట్రేడింగ్ సెషన్లలో 10 సెషన్లలో స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. ఈ నెలలో ఇప్పటివరకూ సెన్సెక్స్ 3.45%, నిఫ్టీ 3.6% చొప్పున క్షీణించాయి. వాణిజ్య యుద్ధ భయాలకు తోడు ముడి చమురు ధరలు భగ్గుమనడం, మరో రూ.1,241 కోట్ల బ్యాంక్ రుణ మోసం వెలుగులోకి రావడం, మరో వారంలోనే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమల్లోకి రానుండటం వంటి అంశాలు కూడా జత కావడంతో మన మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 10,000 పాయింట్ల దిగువకు, బీఎస్‌ఈ సెన్సెక్స్ మళ్లీ 33 వేల పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఈ సూచీలు ఐదు నెలల కనిష్ట స్థాయికి దిగజారాయి. ఐటీ, మీడియా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 410 పాయింట్లు(1.24%) నష్టపోయి 32,597 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు (1.15%)పతనమై 9,998 పాయింట్ల వద్ద ముగిశాయి. మరో వారంలో దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలు కానున్నందున మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.