రాష్ట్రంలో పెరుగుతున్న చలి
హైద్రాబాద్, డిసెంబర్ 23,
కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో రాష్ట్రంలో చలి పెరుగుతోంది. మారిన వాతావరణంతో అనేక మంది వివిధ రకాల వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఆస్థమా, బీపీ, షుగర్, గుండె జబ్బులున్న వారు... గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, చిన్న పిల్లలు, చంటి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చలి ప్రభావంతో నాలుగైదు రోజుల్లో ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య రెెట్టింపు అయింది. ఇందులో జ్వరం, జలుబు, దగ్గు సమస్యలతో ఎక్కువ మంది బాధ పడుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు రెట్టింపు అవుతున్నాయి. ముఖ్యంగా గర్భిణిలు, చిన్న పిల్లలు, వృద్ధులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. పిల్లల్లో సైతం శ్వాసకోశ సమస్యలు ఎక్కువుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే సర్కారు దవాఖానల్లో మందుల కొరత వేధిస్తోంది. పీహెచ్‌సీల నుండి జిల్లా ఆస్పత్రుల వరకు రోగుల సంఖ్యకు సరిపడా మందులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్రమంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉండగా, ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలలో ఈ సమస్య మరీ విపరీతంగా ఉంది. ఇక రాజధానిలోని ఫీవర్ ఆస్పత్రికి సాధారణ రోజుల్లో ఐదారు వందల మంది చికిత్స కోసం వస్తుంటారు. రెండు మూడు రోజులుగా ఈ సంఖ్య అమాంతం పెరిగిందిజలుబు, న్యుమోనియా, సైనస్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు తీవ్రమై ప్రమాదకరంగా మారవచ్చంటున్నారు. దీనికితోడు పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ కేసులూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. చలి ఎంత ఎక్కువ ఉంటే అంతస్థాయిలో వైరస్ బలపడి ఒకరి నుండి ఒకరికి సులభంగా వ్యాపిస్తోంది ఈ మహమ్మరి. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు స్వైన్‌ఫ్లూ ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా గుండె జబ్బులు, ఆస్తమా, న్యూమోనియా, చర్మవ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.. నిత్యం వెయ్యికిపైగా రోగులు ఆస్పత్రికి వస్తున్నారని అధికారులు తెలిపారు. నీలోఫర్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో వైరల్, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు సాధారణమే అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్నిసార్లు శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను నిర్లక్ష్యం చేస్తే చివరికి న్యూమోనియాగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. చాలా తీవ్రమైన మంటలా జ్వరం, అది ఉన్నప్పటికీ పిల్లలు అంత నలతగా, జబ్బు పడినట్టు కన్పించకపోవడం, ముక్కు కారటం, జలుబు, గొంతునొప్పి, టాన్సిల్స్ వాపు, దగ్గు, ఆయాసం, విరేచనాలు... ఇలా రకరకాల లక్షణాలను బట్టి వైరల్ ఇన్‌ఫెక్షన్లను గుర్తించవచ్చు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా ఏటూరు నాగారం, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో అటవీ ప్రాంతాల్లో వ్యాధుల బెడత ఉంది. చెత్తచెదారం, రోడ్లపైనే మురికినీరు పొంగిపొర్లడం కాలువల్లో మురుగునీరు పేరుకుపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు అంతకంతకు పెరుగుతున్నాయి. పలు గూడేల్లో ఇంటింటికి మలేరియా, డెంగీ బాధితులు ఉన్నారు. దోమల బెడద, పారిశుధ్యం, విద్యుత్, ముందస్తు నివారణ చర్యలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో పరిమిత వనరులు, వైద్యులు, సిబ్బంది మందుల కొరత రోగ నిర్దారణ సౌకర్యాలు లేకపోవడం రోగుల పాలిట శాపంగా మారింది