YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

సోయా మాయ.. (ఆదిలాబాద్)

సోయా మాయ.. (ఆదిలాబాద్)

సోయా మాయ.. (ఆదిలాబాద్)
ఆదిలాబాద్, డిసెంబర్ 23 : మార్కెట్‌ మాయజాలం వల్ల సోయా పంట పండించిన రైతులు నష్టపోతుంటే.. అదే పంట ఇప్పుడు వ్యాపారులకు కాసులు కురిపిస్తుంది. పంటను నిల్వ చేసుకోలేక.. ధర పెరుగుతుందనే భరోసా లేక.. ఎంతో కొంత ధర వస్తే చాలాని రైతులు సోయాను అమ్ముకున్నారు. కొనుగోలు సీజన్‌లో తక్కువగా ఉన్న సోయా ధర క్రయవిక్రయాలు ముగిసే సమయంలో అమాంతంగా పెరిగింది. సోయాను నిల్వ చేసుకున్న రైతులు మినహా మిగిలిన రైతులు నష్టపోతున్నారు. వాస్తవానికి రైతులు పంట ఇంటికి రాగానే అవసరాలకు ఆ సమయంలో ఏ ధర ఉంటే ఆ ధరకు అమ్ముకుంటారు. ఏ కొద్ది మందో తప్ప చివరి వరకు ఇళ్ళల్లో నిల్వ చేసుకోని, ధర పెరుగుతుందని ఎదురుచూసే వారు తక్కువే. ఈ ఏడాది మార్క్‌ఫెడ్‌ సోయా నాణ్యతగా లేదని కొద్ది మొత్తాన్ని కొనుగోలు చేసింది. ఉమ్మడి జిల్లా మొత్తంలో 80వేల క్వింటాళ్ల సోయానే కొనుగోలు చేసింది. తేమ శాతం ఎక్కువగా ఉందని, గింజలు నల్లబారి ఉన్నాయని కొనుగోలు చేయకపోవడంతో ధర తక్కువగా వచ్చిన తప్పని సరి పరిస్థితుల్లో వ్యాపారులకే అమ్ముకున్నారు. రైతులు అమ్ముకున్న తరువాత సోయాకు ధర పెరగడం వల్ల ఇప్పటి వరకు జరిగిన క్రయవిక్రయాల వల్ల రైతులు క్వింటాలుకు రూ.300 నష్టపోయినట్లే. బహిరంగ విపణిలో కొనుగోలు ప్రారంభం నుంచి ఇవే ధరలు ఉంటే రైతులకు మేలు జరిగేది. జిల్లా వ్యాప్తంగా 10 లక్షల క్వింటాళ్ల సోయా వస్తుందని అంచనా.. ఇందులో మార్క్‌ఫెడ్‌కు 80 వేల క్వింటాళ్ల సోయాను అమ్మేయగా వ్యాపారులకు మరో అయిదు లక్షల క్వింటాళ్ల సోయా అమ్మి ఉంటారు.. గత వారం రోజులుగా క్వింటాలుకు వంద రూపాయల పెరుగుదల ఉంది. శనివారం క్వింటాలుకు రూ.4,100 లభించింది. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో సోయాను కొనుగోలు చేసేందుకు అధికారులు 15 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఈ ఏడాది 1.75 లక్షల ఎకరాల్లో సోయా సాగైంది. ప్రారంభంలో వర్షాలు కురవకపోవడంతో ఆలస్యంగా విత్తుకున్నారు. పంట ఏపుగా పెరిగి, ఆశించిన దిగుబడి వస్తుందనుకున్న తరుణంలో కాత దశలో వర్షాలు కురవడంతో పంట దెబ్బతింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.3,710ఉంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 80 వేల ఎకరాల్లో సోయా సాగు చేశారు. అత్యధికంగా నిర్మల్‌ జిల్లాలో 88వేల ఎకరాల్లో సోయా సాగు చేశారు. జిల్లాలోని తొమ్మిది కేంద్రాల్లో 72 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా నిర్మల్‌ జిల్లాలో సాగు ఎక్కువగా ఉన్నా.. మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది 8,489 క్వింటాళ్ల సోయాను మాత్రమే, భైంసాలో ఇప్పటికే 80 వేల క్వింటాళ్ల సోయాను రైతులు తక్కువ ధరతో అమ్మేసుకున్నారు. సోయాకు డిమాండ్‌ పెరగడంతో ఇప్పటి వరకు పలు అంక్షలు పెట్టిన వ్యాపారులు ఎలా ఉన్నా సరే కొనుగోలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం సోయాలో తేమ శాతం 10లోపు ఉండాలి, చెత్తాచెదారం, పగిలిన గింజల శాతం మూడు లోపు ఉండాలి. నిబంధనల మేరకు సోయా ఉంటే క్వింటాలుకు రూ.4100 ఇస్తున్నారు. తేమ ఉండి, చెత్తాచెదారం ఉంటే క్వింటాలుకు రూ.3900 ఇస్తున్నారు. సోయా మద్దతు ధర క్వింటాలుకు రూ.3710 ఉండగా, ప్రారంభంలో బహిరంగ విపణిలో కూడా రూ.3500లోపు ఉంది. ధర పెరుగుతుందనే ఆశతో కొంత మంది రైతులు ఇళ్లల్లో నిల్వ చేసుకోగా ఎక్కువ మంది రైతులు అమ్మేసుకున్నారు. నిల్వ చేసుకున్న రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి కొనమని వేడుకున్నా.. నాణ్యతగా లేదని నిరాకరించిన సోయాను ప్రస్తుతం రైతులు రూ.3900 ధరతో అమ్ముకుంటున్నారు.

Related Posts