నెల్లూరు నగరంలో పోలీసుల రౌడీ మేళా!
నెల్లూరు డిసెంబర్ 23
నెల్లూరు నగరం, రూరల్ సబ్ డివిజన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలోని 275 మంది రౌడీషీటర్లకు స్థానిక ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆధ్వర్యంలో రౌడీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒకరు చట్టాలకు లోబడి నడుచుకోవాలని చట్టాలను అతిక్రమించినందుకు మీరంతా రౌడీ షీటర్ గా మారారని అన్నారు.మీతో పాటు మీ పిల్లలు, తల్లిదండ్రుల మీద కూడా ఇది ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. రౌడీ ఇమేజ్ నుండి బయట పడాలి అంటే సత్ప్రవర్తన ఒకటే మార్గం అన్నారు. ప్రతి రౌడీషీటర్ మీద నిరంతరం నిఘా కొనసాగుతుందని ప్రజాశాంతికి ఏ మాత్రం భంగం కలిగించినా పిడియాక్ట్ ఓపెన్ చేస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజాశాంతికి ఎలాంటి భంగం కలిగించినా పర్యవసనాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని హెచ్చరించారు.ఇప్పటికే రౌడీషీటర్ ల వ్యక్తిగత నడవడిక బట్టి వారిని మూడు గ్రేడులుగా విభజించామని అన్నారు. ప్రవర్తనలో ఎలాంటి అనుమానాస్పద తేడాలు గమనించినా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. గూడూరు సబ్ డివిజన్ లో 116 మంది, కావలి సబ్ డివిజన్లో 105 మంది, ఆత్మకూరు డివిజన్లో 54 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్, రూరల్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ లు శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి, కోటారెడ్డి, ఎస్బి సీఐ శ్రీనివాసులు రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.