YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రెండోసారి సీఎంగా సోరెన్

రెండోసారి సీఎంగా సోరెన్

రెండోసారి సీఎంగా సోరెన్
పాట్నా, డిసెంబర్  23, 
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా, ఇప్పటి వరకు కాంగ్రెస్- జేఎంఎం కూటమి మెజార్టీ స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. తమ కూటమి అధికారంలోని వస్తే జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరేన్‌ ముఖ్యమంత్రి అవుతారని ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ మార్క్‌కు చేరువకావడంతో రెండోసారి జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరేన్ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర మాజీ మంత్రి, గిరిజన నేత శిబూ సోరేన్ కుమారుడైన హేమంత్ 2013లో తొలిసారి సీఎం అయ్యారు. 2010 జార్ఖండ్ ఎన్నికల తర్వాత బీజేపీ-జేఎంఎం-జేడీయూ- ఏజేఎస్‌యూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా, తొలుత డిప్యూటీ సీఎంగా ఉన్న హేమంత్... 2013లో సీఎంగా బాధ్యతలు చేపట్టి 2014 డిసెంబరు వరకు కొనసాగారు.అయితే, హేమంత్ సోరేన్ రాజకీయ ప్రస్థానం మాత్రం ఓటమితో మొదలుకావడం విశేషం. రామ్‌గఢ్ జిల్లాలోని నెర్మా గ్రామంలో శిబూ సోరేన్, రూపీ దంపతులకు 1975 ఆగస్టు 10న జన్మించిన హేమంత్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశారు. అయితే, 2005, 2009 ఎన్నికల్లో మాత్రం తాను ఇంటర్ ఉత్తీర్ణుడైనట్టు అఫిడ్‌విట్‌లో పేర్కొన్నారు. ఇక, హేమంత్ 2005 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీచేశారు. దుమ్‌కా స్థానం నుంచి పోటీచేసిన ఆయన తొలి ఎన్నికల్లోనే ఓటమి చవిచూశారు. హేమంత్ రాజకీయ అరంగేట్రమే ఓటమితో స్వాగతం పలికింది. ఆ ఎన్నికల్లో సొంత పార్టీ నేత స్టీఫెన్ మరాండీ రెబల్‌గా పోటీచేసి విజయం సాధించారు.తన సోదరుడు దుర్గా సోరేన్ హఠాన్మరణంతో 2009లో జేఎంఎంలో కీలక బాధ్యతలను స్వీకరించారు. స్వతహాగా నాయకత్వ లక్షణాలున్న పెద్ద కుమారుడు దుర్గాను తన రాజకీయ వారసుడిగా శిబూ సోరేన్ భావించారు. కానీ, ఆయన ఆకస్మిక మరణంతో హేమంత్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. తర్వాత జూన్ 24, 2009 నుంచి జనవరి 4,2010 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ-జేఎంఎం-జేడీయూ- ఏజేఎస్‌యూ కూటమి అధికారంలోకి రావడంతో హేమంత్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. తర్వాత జరిగిన పరిణామాలతో 2013 జులైలో సీఎంగా బాధ్యతలు చేపట్టి 2014 డిసెంబరు వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో హేమంత్ సోరేన్ తన పదవికి రాజీనామా చేశారు.ఇదిలా ఉండగా, గత జనవరి నుంచి అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమైన హేమంత్ సోరేన్ నాయకత్వంలోని జేఎంఎం.. కాంగ్రెస్, ఆర్జేడీ, జీవీఎం (పీ)లతో కలిసి కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించింది. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఆందోళనలకు హేమంత్ నాయకత్వం వహించారు. మద్యం పాలసీ, పాఠశాలల విలీనం తదితర అంశాలపై ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టారు

Related Posts