నడి సముద్రంలో చిక్కుకున్న ఇద్దరు యువకులను డ్రోన్ కాపాడింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో జరిగిందీ ఘటన.న్యూసౌత్ వేల్స్‌లోని సముద్ర తీరంలో లెనాక్స్ హెడ్ అనే గ్రామం ఉంది. అక్కడ బీచ్‌కు సందర్శకుల తాకిడి ఎక్కువ. గురువారం ఇద్దరు యువకులు ఈత కొట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో అలల ఉధృతి పెరగడంతో వారు సముద్రంలో చిక్కుకుపోయారు. ఇది గమనించిన బీచ్‌లోని కొందరు అక్కడి లైఫ్‌గార్డులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే డ్రోన్ పైలెట్‌కు విషయం చెప్పడంతో ఆయన డ్రోన్ ద్వారా సర్ఫ్ పాడ్‌ను పంపించారు.
డ్రోన్ ఆ ఇద్దరు యువకులను గుర్తించి గగనతలం నుంచి సర్ఫ్ పాడ్ వారి వద్ద పడేలా విసిరేసింది. దీంతో వారు సురక్షితంగా ఒడ్డకు చేరుకున్నారు. ఈ వీడియోను న్యూ సౌత్‌వేల్స్ సర్ఫ్ లైఫ్ సేవింగ్ విభాగం ట్విటర్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా వ్యాప్తంగా బీచ్‌ల్లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు అక్కడ డ్రోన్లు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి.