పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్‌ను చుట్టుముట్టిన విద్యార్ధులు
కోల్‌కతా డిసెంబర్ 24
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. మంగళవారం జాదవ్‌పూర్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంకర్‌ను వరుసగా రెండో రోజూ విద్యార్ధులు చుట్టుముట్టడంతో ఉద్రిక్తంగా మారింది. చట్టానికి మద్దతుగా గవర్నర్ బహిరంగ ప్రకటనలు చేయడంపై విద్యార్ధులు భగ్గుమంటూ నల్లజెండాలు చేబూని ఆయనను అడ్డుకున్నారు. మరోవైపు విద్యార్ధుల నిరసనపై గవర్నర్ మండిపడుతూ ఇలాంటి పరిస్థితి నెలకొనేలా యూనివర్సిటీ ఎందుకు అనుమతించిందో తనకు అర్ధం కావడం లేదని, ఇది తనకు దిగ్ర్భాంతి కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. విద్యార్ధుల నిరసనల నేపథ్యంలో వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని గవర్నర్ ధంకర్ వ్యాఖ్యానించారు.జాదప్‌పూర్ యూనివర్సిటీ చాన్సలర్‌గా వ్యవహరిస్తున్న గవర్నర్‌ను విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించి విద్యార్ధులకు పట్టాలను అందచేసేందుకు ఆహ్వానించారు. అయితే గవర్నర్‌ను మాట్లాడనివ్వకుండా విద్యార్ధులు అడ్డుకున్నారు. కొద్దిమంది విద్యార్ధులు మాత్రమే కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని, వ్యవస్థలు ధ్వంసం చేయడం సరికాదని, అది విపరిణామాలకు దారితీస్తుందని గవర్నర్ హెచ్చరించారు. కనుచూపు మేర చట్ట నిబంధనలు కనిపించడంలేదని, రాజ్యాంగ అధిపతిగా ఇది తనను ఆందోళనకు గురిచేస్తోందని ధంకర్ ట్వీట్ చేశారు. కాగా యూనివర్సిటీ ఉన్నతాధికారులతో సమావేశం సందర్భంగా సోమవారం క్యాంపస్‌కు చేరుకున్న సందర్భంలోనూ గవర్నర్‌కు విద్యార్ధులు నల్లజెండాలు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు.