హక్కులతో పాటు బాధ్యతలు తెలుసుకోవాలి
కర్నూలు, డిసెంబర్ 24
సమాజంలో ప్రతి వినియోగదారుడూ తన హక్కులతో పాటు బాధ్యతలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెసి రవి పట్టన్ షెట్టి పిలుపునిచ్చారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వినియోగదారులకు వినియోగ హక్కు చట్టం గురించి ప్రతిరోజు అవగాహన కల్పించాలన్నారు. చట్టం బాగా ఇంప్లిమెంట్ అయ్యేలా వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినియోగ దారుడేనని తెలిపారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారని, వారి హక్కులు, బాధ్యతల గురించి సరిగా తెలుసుకోవడం లేదన్నారు. సమాజంలో బాధ్యతగా వ్యవహరిస్తే నష్ట పోకుండా ఉంటారన్నారు. ఏదైన ఒక వస్తువు కొనుగోలు చేస్తే అది సరిగా ఉందా. లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుందన్నారు. అది సరిగా ఉందో లేదో చూసు కోవాల్సిన కనీస బాధ్యత వినియోగదారుడి దేనన్నారు. జిల్లా వినియోగదారుల ఫోరం ప్రెసిడెంట్ జడ్జి నాజీరునిషా మాట్లాడుతూ ప్రతేడాది మార్చి 15వ తేదిన ప్రపంచ వినియోగ దారుల హక్కుల దినోత్సవం, డిసెంబరు 24న జాతీయ విని యోగ దారుల దినో త్సవం జరుపుకుంటున్నామన్నారు. వినియోగదారుల పరిరక్షణ కోసం 1962 మార్చి 15వ తేదీన అమెరికా అధ్యక్షులు జాన్‌కెనడి ఈ కార్యక్రమాలకు నాంధీ పలికారన్నారు. 1986లో దేశంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం అమలులోకి వచ్చిందన్నారు. ఈ చట్టం వలన వినియోగదారులకు భద్రత, ఎంపిక, నాణ్యత పరిశీలన, నష్టపరిహారం పొందే హక్కులు లభించాయన్నారు. నగదు చెల్లించి పొందే సేవలన్ని వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తాయన్నారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువునకు బిల్లు తప్పని సరిగా తీసుకుంటే ఏదైనా లోపం ఉంటే ఫిర్యాదు చేసి నష్టపరిహారం జిల్లా, జాతీయ ఫోరం ద్వారా పొందవచ్చున్నారు. వస్తువులు కొనుగోలు చేసిన, సేవలు పొందిన 2 సంవత్సరాల లోపు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా జిల్లాలో వినియోగదారుల ఫోరం ద్వారా వివిధ కేసులు గురించి జడ్జి సమావేశంలో వివరించారు. అదేవిధంగా పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరంలో గతంలో పేదవాళ్లకు ఇంటి పట్టాలు మంజూరు చేశారని, వాటిని మరికొంతమంది ప్లాట్లు వేసి డబల్ ఎంట్రీ రిజిస్ట్రేషన్ చేశారని, వారిపై ఫోరంలో కేసు నమోదుచేసి పేదలకు న్యాయం చేయాలని జడ్జిని కోరారు. వినియోగదారుల హక్కు చట్టం వల్ల చాలా న్యాయం జరుగుతుందన్నారు. అదేవిధంగా కర్నూలు ఎమ్మెల్యేే హఫీజ్ ఖాన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ హక్కుల గురించి క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. చట్టాలు, ఫోరం గురించి వినియోగదారులకు చైతన్య కల్పించాల్సిన అవసరం కలదన్నారు. అనంతరం వినియోగదారుల హక్కు చట్టం వారోత్సవాలు జిల్లా స్థాయిలల్లో నిర్వహించిన వ్యాసరచన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డి యస్ ఓ పద్మ శ్రీ, వినియోగదారుల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు యమ్. నదిమ్, జిల్లా వినియోగదారుల రక్షక మండలి కార్యదర్శి శివ మోహన్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.