ఇండియాకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ వార్నింగ్
న్యూ ఢిల్లీ డిసెంబర్ 24
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ ఇండియాకు వార్నింగ్ ఇచ్చింది. ఆర్థిక మందగమనం నుంచి భారత్ గట్టెక్కాలంటే, వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని ఐఎంఎఫ్ సూచించింది. వినియోగం, పెట్టుబడులు, పన్నుల రాబడి తగ్గడం.. మందగమనం ఎక్కువగా ఉండడం వల్ల వృద్ధి వేగం తగ్గినట్లు ఐఎంఎఫ్ చెప్పింది. వార్షిక సమీక్షలో ఆ సంస్థ ఈ వివరాలు తెలియజేసింది. భారత ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం మరీ అద్వాన్నంగా ఉన్నట్లు ఐఎంఎఫ్ అధికారి రాణిల్ సల్గాడో తెలిపారు. ఒకవేళ భారత్ ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడాలంటే ఆ దేశం తక్షణ విధాన చర్యలను అమలు చేయాలని ఆయన సూచించారు. ఆర్థిక మందగమనం ఇదే మాదిరిగా ఉంటే, ఆర్బీఐ పాలసీ రేటును మరింత తగ్గించే అవకాశాలు ఉన్నట్లు సల్గాడో తెలిపారు. సంస్కరణ ఎజెండాను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉందన్నారు.