మత్తులో చిత్తుగా (ఖమ్మం)
ఖమ్మం, డిసెంబర్ 24 : జిల్లా యువత మత్తులో చిత్తవుతోది. యువత మత్తుకు బానిస అవుతూ ఇతరులను ఇదే కూపంలోకి లాగుతున్నారు. నిషాలో ఏం చేస్తున్నారో వారికే తెలియడంలేదు. అసాంఘిక కార్యక్రమాలకు తెగబడుతున్నారనే సంకేతాలు నిఘా వర్గాలకు అందాయి. ముఖ్యంగా ఖమ్మం నగరంలో గంజాయి వినియోగం కలకలం రేపుతోంది.గంజాయి ప్యాకెట్లు కనిపిస్తే నిఘా వర్గాలకు తెలిసిపోతోంది. గతంలో గంజాయి ముఠాలు సరకును సరఫరా చేస్తుండేవి. ప్రస్తుతం సిగరెట్లు, చాక్లెట్లు, కార్డుల రూపంలో బహిరంగ మార్కెట్లో విక్రయాలు సులువుగా చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సిగరెట్ల రూపంలోనే వినియోగిస్తున్నారు. ఈ మత్తుకు బానిసలైన వారు డబ్బుల కోసం గంజాయి విక్రయాలకు తెరతీస్తున్నారు. ఖమ్మంలో గత సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న అయిదుగురిలో ఓ యువకుడు గంజాయిని తెచ్చి మిగిలిన నలుగురికి ఇచ్చాడు. రెండు కిలోల మొత్తంలో వారికి విక్రయించి ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకోవాలనే సలహా ఇచ్చాడు. విద్యార్థుల వసతి గృహాలు, ప్రముఖ డిగ్రీ కళాశాలలు ఉన్న నగర నడిబొడ్డున ఈ అయిదుగురు గంజాయితో పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. పట్టుబడిన యువతను విచారించగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు నగరంలో విక్రయదార్లు, వినియోగదారులు ఎవరనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆబ్కారీ శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఖమ్మం నగరంలో వినియోగం పెరిగిందనే సమాచారం మేరకు పోలీసు, ఆబ్కారీ శాఖలు తనిఖీలు నిర్వహిస్తూ పలువురిని పట్టుకున్నారు. వీరిలో మైనర్లు, 25 ఏళ్లలోపు యువకులు ఉండటంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వదిలేస్తున్నారు. కేసుల నమోదు సమయంలో తల్లిదండ్రులు వచ్చి వేడుకుంటే కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు కోసం ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వదిలేసిన యువకులు, విద్యార్థులు కొందరు తిరిగి అదే ఊబిలోనే కూరుకుపోతున్నారు. తనిఖీ బృందాలకు చాలా మంది దొరికినప్పటికీ విద్యార్థులు కావడంతో వారిని వదిలేశారు. ఖమ్మం రైల్వే స్టేషన్‌కు కూత వేటు దూరంలోని సందులు, గొందుల్లో గంజాయి విక్రయాలు సాగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ వినియోగదారులు పెద్ద సంఖ్యలో గూమి గూడుతున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న వీధీదీపాన్ని సైతం ధ్వంసం చేసి చీకట్లో గంటల తరబడి తమ పని కానిచ్చేస్తున్నారు. ఇలా ఇక్కడికి చేరుతున్న వారు అకారణంగా గొడవలు పడి అడ్డువచ్చిన వారిని చితక బాదుతున్నారు. సందుల్లోనూ ద్విచక్రవాహనాలతో హల్‌చల్ చేస్తున్నారు. పోలీసు, ఆబ్కారీ శాఖలు రెండు జిల్లాల్లో గంజాయి వినియోగం పెరిగిందనే నిర్ణయానికి వచ్చాయి. సరఫరా దారుడిని పట్టుకుంటే శాశ్వత పరిష్కారం ఉంటుందనే ఆలోచనతో ఆ దిశగానే ప్రయత్నం కొనసాగుతోంది. నిఘా నేపథ్యంలో అక్రమార్కులు పెద్ద ఎత్తున సరకు రవాణాకు స్వస్తి పలికారు. అరకిలో నుంచి ఎక్కువలో ఎక్కువ ఐదు కిలోల వరకు వినియోగదారులకు చేరవేస్తున్నారు. ముఖ్యంగా శని, ఆదివారం సెలవు దినాలతో పాటు పర్వదినాల్లో సరఫరా చేస్తున్నారు.