పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతకి కలకత్తా హైకోర్టు షాక్ !
పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ), జాతీయ పౌరుల జాబితా (ఎన్నార్సీ)లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యానర్లు, పోస్టర్లు తొలగించాలంటూ ఆదేశించింది. సీఏఏ, ఎన్సార్సీలను పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమంటూ ఇస్తున్న అన్ని ప్రకటనలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ ఈ ఆదేశాలు ఇచ్చింది.సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా వస్తున్న యాడ్స్‌ను నిషేధించాలని పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కోర్టు ఈ తీర్పునిచ్చింది. యాడ్స్‌ను ప్రసారం చేయకుండా చర్యలు చేపట్టినట్లు అడ్వకేట్ జనరల్ కిశోర్ దత్తా తెలిపారు. కాగా సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ప్రస్తుతం ప్రకటనలు నిలిపేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... పశ్చిమ బెంగాల్ పోలీస్ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ ప్రకటనలు కనిపిస్తున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు.సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఏఏ, ఎన్నార్సీలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు పశ్చిమ బెంగాల్లో సీఏఏ, ఎన్సార్సీలను అమలు చేయబోమని ఇప్పటికే టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.