ఆత్మజ్ఞానం
జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు గతాన్ని పరిశీలించకుండా ఏ మనిషి ఉండలేడు. కొందరైతే ఎప్పుడూ గతాన్నే తలచుకుంటూ ఆనందము లేదా దుఃఖాన్ని అనుభ విస్తూ ఉంటారు. చరమ దశలో మాత్రమే గతాన్ని గురించి ఆలోచించేవారూ ఉంటారు. ఏది ఏమైనా గతాన్ని మరచి ఎవరూ ముందుకు సాగలేరు అనేదిముఖ్యం. దీనికంతటికీ కారణం మనసనే పదార్థం. మన ఉపనిషత్తులు శరీరాన్ని, మనసును కూడా పదార్థంగానే తెలియచేసాయి. మానవ దేహం ఐదు కోశాల సమూసం. అవి స్థూల, ప్రాణ, మనోమయ, బుద్ధి, ఆనందమయ కోశాలు.పిల్లలు, ఆటవికులలో స్థూల, ప్రాణమయ కోశాలు మాత్రమే పనిచేస్తాయి. నాగరికత కల్గిన వారిలో మానసిక కోశం పరిపూర్ణంగా పనిచేస్తుంది. అనుభవం పరిపక్వత సంతరించుకున్న వారిలో బుద్ధికోశం వికసిస్తూ ఉంటుంది.పైవాటినన్నింటినీ అనుభూతి పొందిన మహాత్ములలో మాత్రమే ఆనందకోశం పరిపూర్ణంగా పనిచేస్తుంది. ఈ కోవకు చెందినవారే యోగులు. వీరు ఆత్మానుసంధానం కోసం పరితపిస్తూ ఉంటారు.ఈ పంచకోశాలు ఎప్పుడూ చైతన్యంలోనే ఉంటాయి. చైతన్యరహితమైనపుడు దేహం ఒక వ్యర్థ పదార్థం మాత్రమే! బుద్ధికోశం చైతన్యమై తన కార్యకలాపాలను ఉన్నత స్థితికి తీసుకువెడుతుంది.అంటే భగవంతుని గురించి అన్వేషణ ప్రారంభమయినదని అర్థం.మానసిక పరిపక్వత కల్గినపుడు, బుద్ధి వికసించినపుడు మాత్రమే ఆనందకోశంలో లయం చెందడం జరుగుతుంది. ఈ ఐదు కోశాలకు నేతగా ఉన్నదే ‘ఆత్మ’. ఇదే మహాచైతన్యం. ఇది మాత్రమే భగవదంశ కలిగి ఉన్నది. ఇది లేనిదే పై ఐదుకోశాలు నిరర్థకం.మనసును ఒక పదార్థంగా చెప్పుకున్నాం. ఈ సత్యాన్ని ఉపనిషత్తులు నిరూపించాయి. ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేత కేతువుకి మనస్సు ఆహారమనే పదార్థం చేత, ప్రాణం నీటి చేత, వాక్కు అగ్ని చేత ఏర్పడతాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు.పదిహేను రోజులు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కావల్సినంత జలము మాత్రము త్రాగుతూ ఉండమన్నాడు. తండ్రి ఆజ్ఞ మేరకు పదిహేను దినములు ఆహారం తీసుకొనలేదు. తరువాత తండ్రి వద్దకు వచ్చి శే్వతకేతువును వేదాలను వల్లించమన్నాడు. కాని తనకు ఏమి గుర్తుకురావడంలేదని తెలియజేశాడు.తదుపరి తండ్రి ఆజ్ఞ మేరకు ఆహారం తీసుకుని తిరిగి తండ్రి వద్దకు వచ్చి వేదాలన్నీ తిరిగి వల్లించినాడు. అప్పుడు ఉద్దాలకుడు నీలో ఉన్న సూక్ష్మమైన అగ్నికణికకు ఆహారం అందించగా తిరిగి అది జ్వలించినదని ఇంతవరకు దాని ఉనికిని జలము కాపాడినదని తెలియజేశాడు. కాబట్టి మనస్సు ఆహారం నుండి, ప్రాణం నీటి నుండి, వాక్కు అగ్నినుండి ఏర్పడతాయని నిరూపించాడు.పదార్థంకంటే ఆత్మ వేరు. ఆత్మ మనసనే పనిముట్టుతో బాహ్య ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకొంటుంది అని తెలియజేసాయి మన ఉపనిషత్తులు.తైత్తిరీయోపనిషత్తు దేహం మనస్సు నుండి ప్రారంభించి తుదకు ఆత్మ రూపాన్ని గొప్పగా ఆవిష్కరించి భగవంతుని ఎలా దర్శించుకోవాలో తెలియజేసింది. భగవంతుడు ఆనందమయుడు. ఆయన నుండి ఆనందాన్ని పొందినందువల్లే మనిషి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.భగవంతుడు ఆనందమయుడైనప్పుడు ఆత్మ కూడా ఆనందమయే! ఎందువలనంటే ఆత్మయే భగవంతుడు కనుక. మనిషిలో ఉన్నవాడు, సూర్యునిలో ఉన్నవాడు ఒక్కరే అన్న సత్యాన్ని తెలుసుకున్నవాడు లౌకిక చైతన్యం నుండి విడివడి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ లేదా బుద్ధిమయ, ఆనందమయ కోశాల ద్వారా ఆత్మజ్ఞానం పొందినపుడు మాత్రమే భగవంతుని చేరుకోగలం. ప్రయత్నించడం మన అదృష్టం.