" రామభక్తి సామ్రాజ్యం"
త్రేతాయుగంనాటి శ్రీరామచంద్రమూర్తి మన భారతీయులందరికీ ఆరాధ్యదైవం. శ్రీరాముడి పేరు వినగానే వెంటనే మనకు స్ఫురించే భక్తాగ్రేసరులు పౌరాణిక కాలం నాటి ఆంజనేయుడు.
ఈ యుగంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి .
కర్ణాటక సంగీత ముమూర్తులలో ప్రముఖులు.
వేదవేదాంగములలో పాండిత్యం గల
వీరి పితామహుల కాలంలో కర్నూలు జిల్లా కాకర్ల గ్రామంనుండి , తంజావూరు ప్రభువుల మన్ననతో, తిరువారూరు గ్రామంలో స్థిరపడ్డారు.శ్రీత్యాగరాజస్వామి తమ తలితండ్రులైన కాకర్ల రామబ్రహ్మం, సీతాంబలకు మూడవ సంతానం. పసితనం నుండే తలితండ్రుల భక్తితత్త్వాన్ని వారసత్వంగా చేసుకున్నారు. వీరి కుటుంబమంతా సంగీత విద్వాంసులు కావడం వలన త్యాగయ్యగారికి కూడా సంగీతవిద్య ఆలవడింది. తల్లితండ్రులే వీరికి ప్రాధమిక గురువులు కాగా, శ్రీ శొంఠి రమణయ్యగారి వద్ద సంగీత శుశ్రూష చేశారు.వీరికి ఇష్టదైవం శ్రీరాముడు. అతి చిన్న వయసులోనే శ్రీ శొంఠి వెంకట రమణయ్య గారి ప్రోద్బలంతో ప్రముఖ సంగీత విద్వాంసుల సమక్షంలో కచేరీ చేశారు. ఆ సందర్భంలో వారు గానం చేసిన కీర్తన బిలహరి రాగంలో " దొరకునా యిటువంటి సేవ " అని అంటారు.త్యాగరాజస్వామి తన యిష్టదైవమైన శ్రీరాముడి మీదనే వందలాది కీర్తనలు, కృతులు రచించారు.స్వామి భక్తి పరాయుణుడైన త్యాగరాజస్వామి వారినితంజావూరు ప్రభువులైన శరభోజీ మహారాజులు విలువైన కట్న కానుకలు పంపి తమ ఆస్థాన గాయక పదవిని స్వీకరించమని సాదరంగా ఆహ్వానించారు. కానీ, యిహలోక సుఖాలపై, పదవులపై, భోగభాగ్యాలపై ఏమాత్రం ఆసక్తి చూపక ప్రభువుల ఆహ్వానాన్ని నిరాకరించారు. ఆ సందర్భంగానే కళ్యాణి రాగంలో "నిధి చాలా సుఖమా " అనే కీర్తనను గానం చేశారు. కుటుంబ పోషణకోసం ఉంఛావృత్తిని స్వీకరించారు.కూచిపూడి భాగవతుల కోరికపైన ఆనందభైరవి రాగాన్ని వారికి వదిలిపెట్టారు. ఆ రాగంలో కేవలం మూడు కీర్తనలు మాత్రమే ఉన్నాయని చెప్తారు త్యాగారాజస్వామి శ్రీరాముడి మీదనే కాక యితర దేవతామూర్తులపైన కూడా కీర్తనలు వ్రాశారు. నానాక్షేత్ర సందర్శనం చేసే సమయం లో ఆ కీర్తనలు వ్రాయడం జరిగింది. తిరుపతి క్షేత్రంలో ' తెర తీయగరాదా ' కీర్తనను వ్రాశారు. త్యాగరాజస్వామి భక్తి తత్పరతకు నిదర్శనంగా ఒక సంఘటన.ఒకసారి వారు శ్రీరంగ క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ రంగనాధుని రధోత్సవ ఊరేగింపు జరుగుతున్నది. రధం మీది రంగనాధుని సేవించుకోవాలని త్యాగయ్యగారు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూన్నారు. కానీ రధం వారు నిల్చున్నవేపు కాకుండా వేరొక వీధిలోకి మరలిపోయింది. కానీ, రధం ముందుకు నడవక నిలబడిపోయింది. కారణం తెలియక అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో ఎవరో వారికి శ్రీ త్యాగరాజస్వామి వారు అవతలి వీధిలో స్వామి దర్శనంకోసం నిరీక్షించారని తెలియజేయగానే అక్కడి ప్రముఖులు వెళ్ళి త్యాగయ్యగారిని తోడ్కొని వచ్చి రంగనాధుని రధం ముందు నిల్చోబెట్టగానే రధం ముందుకు కదలిందట.శ్రీ త్యాగరాజస్వామి వారు అనేక సందర్భాలకు అనేక దేవతామూర్తులపై కీర్తనలు వ్రాశారు. శ్రీ త్యాగరాజస్వామి వారు ప్రహ్లాద భక్తవిజయం కీర్తనలు, నౌకాచరిత్రము, దివ్యనామ కీర్తనలు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, ఘనరాగాలలో ( నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీ రాగాలు) పంచరత్న కీర్తనలు, శ్రీరామపరంగా వందలాది కీర్తనలు వ్రాశారు.శ్రీత్యాగరాజస్వామి వారి శిష్య పరంపర ఆ కీర్తనలన్నింటిని లోక ప్రచారం చేయడం జరిగింది.పుష్యమాసం లోని శుద్ద ఏకాదశినాడు తిరువయ్యార్ లో శ్రీ త్యాగరాజస్వామి వారికి బ్రహ్మాండమైన ఆరాధనోత్సవం జరుగుతుంది. ప్రపంచం నలుమూలలా వున్న కర్ణాటక సంగీతవిద్వాంసులంతా ఆ రోజు ఉదయం నుండి అయ్యవారి సమాధిముందు త్యాగయ్యగారి పంచరత్న కీర్తనా గానం చేసి తమ భక్తి ప్రపత్తులను వెల్లడించుకుంటారు. ఈ ప్రత్యేక గానం వినడమే మహాదృష్టంగా కర్ణాటక సంగీత ప్రియులు భావిస్తారు.
శ్రీ త్యాగరాజ గురుభ్యోన్నమః