వడివడిగా పెనుగంగపై చనాక -కోరట బ్యారేజీ పనులు
అదిలాబాద్, డిసెంబర్ 26,
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైతాంగానికి సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలనే లక్ష్యంతో సర్కారు ముందుకు వెళ్తున్నది. నిర్మల్ జిల్లాలో గోదావరి ఆధారితంగా సదర్‌మాట్ బ్యారేజ్, కాళేశ్వరం ప్యాకేజీ 27, 28 పనులు ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగపై చనాక -కోరట బ్యారేజీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ పనులు శరవేగంగా సాగుతున్నా యి. కాళేశ్వరం 27, 28 ప్యాకేజీ పనులతో నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు ప్రస్తుతం చేపడుతున్నారు. ప్యాకేజీ-27 ద్వారా నిర్మల్ నియోజకవర్గంలో 99 గ్రామాల్లో 50వేల ఎకరాలు, 28వ ప్యాకేజీ ద్వారా ముథోల్ నియోజకవర్గంలో 54 గ్రామాల్లో 50వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. రూ.714కోట్లతో చేపట్టిన ప్యాకేజీ -27కు రూ.448 కోట్లు ఖర్చు చేసి 66శాతం పనులు, రూ.486.67కోట్లతో చేపట్టిన ప్యాకేజీ-28కు రూ.235.35కోట్లు వెచ్చించి 50శాతం పను లు పూర్తి చేశారు. మామడ మండలం పొన్కల్ వద్ద రూ.412కోట్లతో సదర్‌మాట్ బ్యారేజీ నిర్మాణం చేపట్టగా.. ఇది పూర్తయితే 18వేల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగపై చనాక కోరట బ్యారేజీని రూ.324కోట్లతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే బ్యారేజీ నిర్మాణం, పంపుహౌస్ పనులు పూర్తవుతుండగా.. 24 గేట్లకు గాను 18గేట్లను అమర్చారు. ఈ బ్యారేజీ నుంచి 52వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టు, బ్యారేజీల నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టుల పూర్తిపై రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టి పెట్టారు. ఇప్పటికే పలుమార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలించారు. సాగునీటి పారుదలశాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. భూములు కోల్పోయిన నిర్వాసితులు, నిర్మాణ పనులు చేపడుతున్న ఏజెన్సీల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేసి.. రైతాంగానికి సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.