దిశ చట్టంపై ముఖ్యమంత్రి సమీక్ష
అమరావతి డిసెంబర్ 26
దిశ చట్టం అమలుకోసం తీసుకుంటున్న చర్యలపై సీఎం వైయస్.జగన్ గురువారం సమీక్ష జరిపారు. ఈ భేటికి హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, అడ్వకేట్ జనరల్ శ్రీరాం, డీజీపీ గౌతం సవాంగ్ తదితర అధికారులు హజరయ్యారు. దిశ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. న్యాయపరంగా, పోలీసు పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నదానిపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. చట్టం చేశాం, కాని అమలుకావడంలేదన్న మాట ఎక్కడా రాకూడదు, వినిపించకూడదు. రేపు పొద్దున ఎవ్వరుకూడా మనల్ని వేలెత్తిచూపకూడదు. ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదన్న ఏకైక అజెండాతో చాలామంది పనిచేస్తున్నారని అన్నారు. కేవలం టీడీపీతోనే కాకుండా టీడీపీ అనుకూల మీడియాతో, చంద్రబాబుకు మద్దతిస్తున్న వారితో మనం పోరాటంచేస్తున్నామన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలి. పేదలకోసం మనం ఇంగ్లిషు మీడియంను స్కూళ్లలో ప్రవేశపెడుతున్నాం, మద్యం మహమ్మారిని పారదోలాలనే ఉద్దేశంతో తొలిదశ చర్యలు తీసుకున్నాం. మద్యం నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలను తగ్గించాం, పర్మిట్ రూమ్లను నిషేధించాం, బెల్టుషాపులను ఏరివేశాం, బార్ల సంఖ్యను తగ్గించామని అన్నారు. ప్రజా ప్రయోజనాలకోసం తీసుకున్న ఈ చర్యలపై కూడా ఎలాంటి ప్రచారం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. దిశ చట్టం పగడ్బందీ అమలుకు అన్ని చర్యలూ తీసుకోవాలని అయన సూచించారు. పదమూడు కోర్టులకు అవసరమైన బడ్జెట్ను కూడా వెంటనే కేటాయించాలని అక్కడికక్కడే అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రతికోర్టుకూ సుమారు రూ.2 కోట్లు అవసరం అవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. దాంతో వారంరోజుల్లోగా అవసరమైన డబ్బును వెంటనే డిపాజిట్ చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు సమావేశంలో నిర్ణయించారు. దానికి అవసరమైన నిధులకు కేటాయింపునకు సీఎం ఆదేశించారు. పోలీస్ హెడ్క్వార్టర్స్లో ప్రస్తుతం ఉన్న ఫోరెన్సిక్ విభాగాన్ని రెట్టింపు చేయడానికి, మరో రెండు ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేయడానికి సీఎం అంగీకరించారు. వైజాగ్, తిరుపతిల్లో కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటు చేస్తారు. దిశచట్టం అమలుకు ఏంకావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి స్పష్టంచేసారు. రాష్ట్రంలోని 18 మహిళా పోలీస్స్టేషన్లలో 1 డీఎస్పీ, ముగ్గురు ఎస్సైలను, 4గురు సపోర్టు సిబ్బందిని ఏర్పాటు చేయాలంటూ డీజీపీ ప్రతిపాదించగా, దానికి సీఎం అంగీకారం తెలిపారు. దిశ చట్టం అమలుకోసం పోలీసు విభాగంలో ఒక ఐపీఎస్ అధికారిని నియమించే ఆలోచన చేయాలని సీఎం అన్నారు.