YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 ఏడిపిస్తున్న రొయ్య (నెల్లూరు)

 ఏడిపిస్తున్న రొయ్య (నెల్లూరు)

 ఏడిపిస్తున్న రొయ్య (నెల్లూరు)
నెల్లూరు, డిసెంబర్ 26: జిల్లాలో ఆక్వాసాగు తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. నాణ్యతలేని రొయ్య పిల్లలు (సీడ్‌), మార్కెట్‌లో వ్యాపారులు, దళారుల మాయాజాలం ఆక్వారైతుల పాలిట శాపంగా మారాయి. 12 మండలాల్లో రొయ్యల సాగుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీంతో ఇందుకూరుపేట, అల్లూరు, బోగోలు, చిల్లకూరు, కావలి, కోట, ముత్తుకూరు, సూళ్లూరుపేట, తడ, తోటపల్లిగూడూరు, వాకాడు, విడవలూరు మండలాల్లో రొయ్యసాగు అధికంగా ఉంటుంది. కానీ నేడు అధికశాతం మంది రొయ్య రైతులు ప్రస్తుత ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సాగుచేసేందుకు భయపడుతున్నారు. కొందరు పెట్టిన పెట్టుబడులు రాకా అప్పుల పాలయ్యారు. వెనామీ వచ్చిన తొలి రోజుల్లో రైతులకు మంచి లాభాలు వచ్చాయి. అంతకు ముందు టైగర్‌రొయ్యతో నష్టాలను చవిచూసిన వేలాది మంది రైతులకు వేనామి సాగు ఎంతో ఊరటనిచ్చింది. కానీ రెండేళ్లుగా ఈ వేనామి రొయ్యలసాగులోనూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నాసిరకం సీడ్‌ సరఫరాతో వారికి ఈపరిస్థితి ఏర్పడింది. రూ.లక్షలు పెట్టి రొయ్యపిల్లల్ని (సీడ్‌) కొనుగోలు చేసి చెరువుల్లో వదిలిన నెలరోజులకే అవి చనిపోతున్నాయి. కొందరు రైతులు ఇక్కడ సీడ్‌లో నాణ్యతలోపం ఉందని చెన్నై, పాండిచ్చేరి, భీమవరం తదితర ప్రాంతాల నుంచి సీడ్‌ తీసుకువచ్చి చెరువుల్లో వదులుతున్నారు. అక్కడి నుంచి తీసుకువచ్చిన సీడ్‌లోనూ నాణ్యతాలోపం ఉంటోంది. అధికశాతం హెచరీల యాజమాన్యాలు నాణ్యమైన రొయ్యపిల్లల్ని ఉత్పత్తి చేయకుండా నాశిరకమైన రొయ్య పిల్లల్ని రైతులకు అమ్ముతున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన జిల్లా మత్య్సశాఖాధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఆయా హేచరీలపై దాడులు చేసి నాసిరకమైన రొయ్యపిల్లల ఉత్పత్తిని అడ్డుకోవడంలో ఆయా అధికారులు విఫలమవుతున్నారు. దీంతో జిల్లాలోని అనేక మంది హేచరీల నిర్వహకులు రొయ్యరైతులను నిలువునా మోసం చేస్తూ లాభాలు గడిస్తున్నారు. రెండేళ్ల కిందట ఎకరా చెరువును రూ.50 వేల నుంచి రూ.1లక్ష వరకు లీజుకు తీసుకుని సాగు చేపట్టిన రైతులు నేడు ఈ సాగుపై విముఖత చూపుతున్నారు. గతంలో ఇతర జిల్లాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి రొయ్యల సాగుచేసేవారు. విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రీయులు కూడా ఇక్కడ రొయ్యలసాగు చేస్తే లాభాలు వస్తాయని పెట్టుబడులు పెట్టేవారు. జిల్లాలో 10వేల హెక్టార్లలో సాగుతున్న రొయ్యల సాగు నేడు ఈవిపత్కర పరిస్థితుల వల్ల 3వేల హెక్టార్లకు పడిపోయింది. గతంలో ఒక్కొక్క రొయ్యల చెరువులో 3 నుంచి 4 లక్షల వరకు సీడ్‌ వదిలి సాగుచేసే రైతులు నేడు లక్షకే పరిమితమయ్యారు. రొయ్యలసాగు చేస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందనే భయంతో వారు మొక్కుబడి రొయ్యల సాగు చేస్తున్నారు. మరోవైపు మార్కెట్‌లోని రొయ్యల వ్యాపారులు, దళారులు సాగు బాగున్నప్పుడు ధరలు తగ్గించడం, సాగు విస్తీర్ణం తగ్గినప్పుడు ధరలు పెంచుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. వ్యాపారులు, దళారుల ధరల మాయాజాలంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తరుణంలో రొయ్యసాగు చేయడం నేడు ఎంతో కష్టతరంగా ఉంది. నేడు మంచుకాలం, చలిగాలితోపాటు వైట్‌ స్పాట్‌, ఈహెచ్‌బీ తదితర అంతుపట్టని వ్యాధులు సోకి రొయ్యపిల్లలు చనిపోతున్నాయి. ఈవిధంగా రైతులు వెచ్చించిన రూ.లక్షల పెట్టుబడి పోవడమేకాకుండా.. రొయ్యలసాగులో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని అనేక మంది రైతులు ఆక్వాసాగును వదిలేశారు. నిన్నమొన్నటి వరకు రొయ్యల గుంతలకు భారీ డిమాండ్‌ ఉండేది. కానీ నేడు ఈ సాగుచేసేందుకు రైతులు జంకుతున్నారు.

Related Posts