రొయ్యలపైనే దృష్టి (ఆదిలాబాద్)
ఆదిలాబాద్, డిసెంబర్ 26: జిల్లాలో ఇప్పటివరకు చెరువుల్లో చేపట్టిన చేప పిల్లల పెంపకంతో మంచి ఫలితాలు రావడంతో ప్రభుత్వం రొయ్యల పెంపకంపై దృష్టి సారించింది. జలాశయాలకు పరిమితమైన వీటి పెంపకం ఇక నుంచి చెరువుల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది ప్రయోగాత్మకంగా రెండు చెరువుల్లో చేపట్టనున్నారు. ఇందులో రొయ్యలు సమృద్ధిగా పెరిగితే వచ్చే ఏడాది నుంచి మరిన్ని చెరువుల్లో పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో 45 మత్స్య కార్మిక సంఘాలు ఉన్నాయి. సంఘాల్లో సభ్యులు 2,574 మంది ఉన్నా చేపల ద్వారా ఆరువేల మంది ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు చేప పిల్లలను వదిలేవారు. వీటితో మత్స్యకార్మికులు ఉపాధి పొందుతుండటంతో తాజాగా రొయ్యలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది జిల్లాలోని సాత్నాల, మత్తడివాగులో రొయ్యలు వదిలారు. ఈ ఏడాది చెరువుల్లో కూడా రొయ్యలను పెంచితే అదనంగా ఆదాయం పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రయోగాత్మకంగా రెండు చెరువుల్లో రొయ్యలను వదిలేందుకు ఆదేశాలు జారీ చేసింది. జలాశయాలతో పాటు 157 చెరువుల్లో 1.03 కోట్ల చేపపిల్లలను వంద శాతం రాయితీపై చెరువుల్లో వదిలారు. చేపపిల్లలు, రొయ్యలు నిర్ణిత కాలంలోనే వదిలితే, అవి పెరిగే అవకాశముంది. రొయ్యలు పెరగాలంటే అయిదారు నెలలు కావాలి. ఈ నెలలో వదిలితే జూన్ నెలలో చేతికి అందే అవకాశముంది. వాస్తవంగా ఏప్రిల్‌లో పూర్తయితే ఇబ్బందులు ఉండవు. మే నెలలో చెరువుల్లో నీళ్లు తగ్గే వీలుంది. టెండర్లు ఖరారు చేసిన అధికారులు రొయ్యలను సకాలంలో పంపిణీ చేయకపోవడం వల్ల నష్టం జరుగుతుందని మత్స్యకారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చెరువుల్లో వదిలే చేపపిల్లల్లో రెండు రకాల పరిమాణాల్లోవి వదలాలి. పూర్తిగా నీటితో నిండిన చెరువుల్లో 45 రోజుల వయసు ఉన్న 35-40మి.మీ పొడవు ఉన్న చేపపిల్లలు వదలాల్సి ఉంటుంది. ఏడాది మొత్తం నీరు ఉండే పెద్ద చెరువులు, జలాశయాల్లో 75రోజుల వయస్సుతో ఉన్న 80-100 మి.మీల పొడవు ఉన్న చేపపిల్లలు వదలాల్సి ఉండగా, పరిమాణాలతో సంబంధం లేకుండా చిన్న పరిమాణంతో ఉన్న చేపపిల్లలు ఎక్కువ వదులుతున్నారని మత్స్యకారులు అంటున్నారు. చేపపిల్లలను నీటిలో వదిలిన తరువాత కిలో పరిమాణంలోని చేప కావాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. సెప్టెంబర్ నెలలో వదిలితే అవి కిలో పరిమాణానికి రావాలంటే జనవరి నెల వస్తుంది.. ఇంకా పెరగాలంటే వేసవి వచ్చేస్తుంది. ఉష్ణోగ్రతల కారణంగా చేపలు నీటిలోనే చనిపోయే అవకాశం ఉందని మత్స్యకారులు అంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా రొయ్యల పెంపకాన్ని చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్లు పూర్తి అయ్యాయి. రొయ్య పిల్లలు పంపిణీ కావాల్సి ఉంది. సాత్నాల జలాశయంలో 2.40 రొయ్యలను ఇప్పటికే వదిలారు. మత్తడివాగులో 1.46 లక్షలు వదలాల్సి ఉంది. వీటితో పాటు జిల్లాలో ఎంపిక చేసిన బజార్‌హత్నూర్ మండలం దేగావ్, ఉట్నూర్‌లోని గోపాల్‌పూర్ చెరువుల్లో 2.70 లక్షల రొయ్య పిల్లలను వదిలేందుకు ప్రతిపాదనలు పంపించారు. చేపలతో పోలిస్తే.. వీటికి మార్కెట్‌లో ఎక్కువ ధర ఉంటుంది. ఆశించిన స్థాయిలో రొయ్యలు పెరిగితే మత్స్యకారులు లబ్ధి పొందే అవకాశం ఉంది.