YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తేమతో తంటా (ఖమ్మం)

తేమతో తంటా (ఖమ్మం)

తేమతో తంటా (ఖమ్మం)
ఖమ్మం, డిసెంబర్ 26 : సాగునీరు సకాలంలో అందింది.. చీడపీడల సమస్యను రైతులు అధిగమించారు.. ఫలితంగా ఈ ఖరీఫ్‌లో వరి దిగుబడి గణనీయంగా పెరిగింది. ఖమ్మం జిల్లాలో 153.57 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 142.41 శాతం వరి సాగు నమోదు చేసుకోగా దిగుబడి కూడా భారీగా వస్తుండటంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతోంది. కానీ ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించడానికి కర్షకులు మరింత కష్టపడాల్సి వస్తోంది. వరి రైతులకు దిగుబడి యోగం లభించింది. ఆశించిన దానికంటే అధికంగా పంట ఉత్పత్తి వస్తోంది. అయితే వీరి ఆనందం తేమ రూపంలో ఆవిరిగా మారిపోతోంది. మెజారిటీ రైతులు ఆధునిక యంత్రాలతో నూర్పిడి చేస్తున్నారు. కోసిన పంట కోసినట్లుగా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో తేమ శాతం 28-35 మధ్య ఉంటోంది. ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటే తేమ శాతం 17గా ఉండాలని నిర్దేశించారు. ఏ-గ్రేడు ధాన్యం క్వింటా ధర రూ.1,835, కామన్‌ రకం ధర రూ.1,815. ఆ ‘లెక్క’ ప్రకారం కొనుగోళ్లు చేస్తున్నారు. ఖమ్మం గ్రామీణ మండలం పోలేపల్లికి చెందిన భిక్ష్మారెడ్డి తనకున్న నాలుగెకరాల్లో వరి సాగు చేశారు. గ్రామానికి సమీపంలోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చారు. కేంద్రం ఆవరణలో తేమ శాతం తగ్గించేందుకు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. వరి కోత తర్వాత సాధారణంగా తేమ శాతం 28-35 శాతం వరకు ఉంటుంది. దానిని 17 శాతానికి తగ్గించాలంటే కనిష్ఠంగా నాలుగు రోజులు, గరిష్ఠంగా ఎనిమిది రోజుల వరకు ఆరబెట్టాల్సి వస్తోంది. పొలం మీదనే గెలలు బాగా ఎండేలా చూస్తే సమయం కొంత రైతులకు కలిసి వస్తోంది. ఏదేమైనా ధాన్యం కొనుగోలు చేసే వరకు అన్నదాతలు కేంద్రం వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితే.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టడానికి రోజుకు కనిష్ఠంగా మూడుసార్లు, గరిష్ఠంగా అయిదు సార్లు నేర్పుతున్నారు. శాతం ధాన్యం పైపొరతోపాటు లోపలి పొరల్లో ఉన్న తేమను సైతం కొలుస్తున్నారు. రెండు పొరలకు సంబంధించి 17 శాతం ఉంటేనే కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ప్రతి రైతు నాలుగు నుంచి పది రోజుల వరకు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. మరికొందరు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పోసి వెళ్లిపోతున్నారు. తేమ శాతం తగ్గిన తర్వాత అమ్మేద్దామని వారి ఉద్దేశం ధాన్యం సేకరణలో 1061, 1075 రకాల ధాన్యం కొనుగోళ్లు మందగమనంలో సాగుతున్నాయి. 1061 సన్న రకమా? దొడ్డు రకమా? స్పష్టతలేదు. దీనిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. 1075 రకం కొనుగోలు తక్కువగా ఉన్నాయి. అందుకు కారణం బియ్యం ముక్కలుగా అవుతుందన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో వీటి కొనుగోలు తక్కువగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ఒకే రకం ధాన్యం సేకరించి లారీల్లో నింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా ఆయా రకం ధాన్యం లారీ నిండేందుకు సమయం పట్టడం, కొనుగోలుకు మిల్లుల యజమానులు వెనుకంజ వేయడం రైతులకు ఇబ్బందిగా మారింది. ఒక వైపు అధికారులు 17 శాతం తేమ ఉండాలన్న నిబంధన విధించారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతో నిర్దిష్ట తేమ శాతం రావడానికి సమయం పడుతోంది. అనుకోకుండా వర్షం వస్తే తమ పరిస్థితి ఏమిటీ? అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. కొనుగోలు కేంద్రాలు ఆరుబయటే ఉంటాయి. అకాల వర్షాలు సంభవిస్తే ధాన్యం తడవకుండా ఉండే ఆయా కేంద్రాల వద్ద చేసిన ఏర్పాట్లు అంత ఘనంగా ఏమీలేవు. ఈ నేపథ్యంలో వచ్చిన ధాన్యం వచ్చినట్లుగా కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తే వర్షాలు వచ్చినా రైతులకు నష్టం చేకూరదు. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మరింత శ్రద్ధ పెట్టాలని రైతులు కోరుతున్నారు.

Related Posts