కల్పన మృతి ఘటనపై సీబీఐ దర్యాప్తు జరగాలి
సిద్దిపేట డిశంబర్ 26
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశ్ నాయక్ తండాకు చెందిన లావుడ్యా కల్పన గత 11 నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పై సి.బి.ఐ చేత విచారణ జరిపి బాధితులను శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం మందకృష్ణ మాదిగ అక్కన్నపేట మండలం కేశ్ నాయక్ తండా లో కల్పన కుటుంబ సభ్యులను పరామర్శించి జరిగిన సంఘటన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం హుస్నాబాద్ ఏసిపి ని కలిసి విలేకరులతో మాట్లాడారు. కల్పనది ముమ్మాటికీ ఆత్మహత్య కాదని ఆమెను హత్య చేశారన్నారు. 11 నెలలు గడుస్తున్నా కల్పన కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించకపోవడం విచారకరమని, ఈ కేసుపై ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణి అవలంబిస్తుందన్నారు. కల్పనను హత్య చేసింది పోలీసు శాఖకు సంబంధం ఉన్న వ్యక్తి కావడంతోనే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కల్పన మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించి, సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.