చేతబడి అనుమానం... ఇల్లు దగ్ధం
కాకినాడ, డిసెంబర్ 26,
కాకినాడలో చేతబడి కలకలం రేపింది. చేతబడి చేస్తోందన్న నెపంలో స్థానికులు కొయ్యాల పాపమ్మ అనే మహిళపై దాడికి పాల్పడ్డాడు. వందలాది మందిగా ఆమె ఇంటికి చేరుకున్న ప్రజలు ఇంట్లోకి ప్రవేశించి వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఆమెను బయటకు ఈడ్చుకొచ్చి విచక్షణా రహితంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధితురాలిని రక్షించారు.పాపమ్మ చేతబడి చేయడంతో కోనాడ సత్యనారాయణ అనే వ్యక్తి 15 రోజుల క్రితం చనిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం పాపమ్మ ఓ యువతితో మాట్లాడిందని, బుధవారం ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిందని చెబుతున్నారు. తాము వెంటనే అప్రమత్తమై అడ్డుకోవడంతో యువతి ప్రాణాపాయం నుంచి బయటపడిందని కుటుంబసభ్యులు తెలిపారు. యువతిపై పాపమ్మ చేతబడి చేయడంతో ఆత్మహత్యకు యత్నించిందని వారు ఆరోపిస్తున్నారు.ఈ కారణంగానే గురువారం స్థానికులు పాపమ్మ ఇంటిపై దాడి చేసి ఆమెను చితక్కొట్టారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధితురాలిని వేరే ప్రాంతానికి తరలించారు. పాపమ్మ ఇంటి వద్ద పహారా ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు కాకినాడ పోలీసులు తెలిపారు.