YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఎన్డీఏ కూటమి మరో షాక్

Highlights

  • కూటమితో జీజేఎం తెగదెంపులు 
ఎన్డీఏ కూటమి మరో షాక్

బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మరో షాక్ తగిలింది. కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు భాగస్వామ్య పార్టీ అయిన గూర్ఖా జన్‌ముక్తి మోర్చా (జీజేఎం) శనివారంనాడు ప్రకటించింది. బీజేపీపై గూర్ఖాలు ఉంచిన నమ్మకాన్ని ఆ పార్టీ వమ్ము చేసిందని జీజేఎం ఆర్గనైజింగ్ చీఫ్ ఎల్ఎల్ లామా ఆరోపించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో ఇంకెంతమాత్రం తమ పార్టీ సంబంధాలు కొనసాగించేది లేదని తెగేసి చెప్పారు. జీజేఎంతో ఎన్నికల పొత్తు మాత్రమే తాము పెట్టుకున్నట్టు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఇటీవల చేసిన ప్రకటనపై జీజేఎంలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఎన్డీయే కూటమికి ఉద్వాసన చెబుతున్నట్టు జీజేఎం ప్రకటించింది.


'గూర్ఖాల కలే మోదీ కలంటూ బీజేపీ చెప్పింది. దిలీప్ ఘోష్ ప్రకటనతో బీజేపీ మాటలన్నీ బూటకాలని అర్ధమైంది. ఉమ్మడి రాజకీయ తీర్మానం ఏమీ లేదని, ఎన్నికల ముందు పొత్తు మాత్రమే మా మధ్య ఉందని ఘోష్ ప్రకటించారు. దీంతో గూర్ఖాల డిమాండ్‌పై బీజేపీకి సానుభూతి కానీ, సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి కానీ లేదనే విషయం తేలిపోయింది' అని లామా మండిపడ్డారు. బీజేపీ కోసం గూర్ఖా జన్‌ముక్తి మోర్చా ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. 2009, 2014 ఎన్నికల్లో డార్జిలింగ్ లోక్‌సభ సీటును జీజేఎం బహుమతిగా ఇచ్చిందన్నారు.


2009లో కూడా డార్జిలింగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత జస్వంత్ సింగ్‌ పోటీ చేసినప్పుడు జీజేఎం మద్దతు ఇచ్చిందని గుర్తు చేసారు. బీజేపీ నాయకత్వ పనితీరు నచ్చనప్పటికీ 2014లో బీజేపీ అభ్యర్థి ఎస్ఎస్ అహ్లూవాలియాకు బిమల్ గౌరంగ్ సారథ్యంలోని జీజేఎం మద్దతిచ్చిందని ఆయన అన్నారు. బీజేపీకి డార్జిలింగ్ 'పొలిటికల్ గేట్ వే 'అని, జీజేఎం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఏళ్ల తరబడి తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశతో ఎదురుచూస్తున్న ప్రజలను బీజేపీ మరోసారి వంచించిందని తప్పుపట్టారు. ఇవాళ డార్జిలింగ్‌లో ఎవర్ని ఎవరూ నమ్మే పరిస్థితికి కానీ, రాజకీయ కల్లోల పరిస్థితికి కానీ బీజేపీనే కారణమని లామా దుయ్యబట్టారు.

Related Posts