తీర ప్రాంత గస్తీ బలోపేతం
ఒంగోలు, డిసెంబర్ 26, :
సముద్ర తీర ప్రాంతాల గస్తీ మరింతగా పెంచాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాల భద్రతపై మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులతో గురువారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్ లో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రకాశం జిల్లా సముద్ర తీరంలోకి అక్రమంగా చొరబడుతున్న చెన్నై, పాండిచ్ఛేరి బోట్లు నియంత్రించడానికి ఎమ్.ఎఫ్-2 బోట్లు గస్తీ కోసం సిద్ధం చేయాలని ఆయన అన్నారు. అత్యవసరంగా నెల్లూరు జిల్లా కృష్ణ పట్నం పోర్టు నుంచి 2 బోట్లు అద్దెకు తీసుకోవాలని ఆయన సూచించారు. వాటి నిర్వహణ, వినియోగానికి అవసరమైన నిధులకు ఆయన ఆమోదం తెలిపారు. జిల్లాలో 102 కిలో మీటర్ల తీరప్రాంతంలో మత్స్యకార గ్రామాల్లో 20 సి.సి కెమేరాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. రామాయపట్నం వద్ద జెట్టీలు నిర్మాంచడానికి అనుమతిస్తూ ఉపాధి హామి నిధులు కేటాయించాలని ఆయన తెలిపారు. చీరాల తీరప్రాంతం వద్ద మెరైన్ అవుట్ పోస్టు వద్ద 10 సెంట్లు భూమి కేటాయించాలని డి.ఆర్.ఓ.ను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 47,530 మంది మత్స్యకారులకు బయోమెట్రిక్ ద్వారా వేలుముద్రలు సేకరించామని అందులో 37,182 మందికి గుర్తింపు కార్డులు పంపిణీ చేయగా మిగిలిన వారికి కార్డులు ఇవ్వాల్సివుందని మత్స్యశాఖ అధికారులు ఆయనకు వివరించారు. సముద్రంలో రాష్ట్ర సరిహద్దుల దాటిన మత్స్యకారులకు భద్రత కల్పించడానికి మెరైన్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు శాటిలైట్ అనుసంధానం ద్వారా పనిచేసే 350 హెల్మెట్ లు పనితీరుపై ఆయన ఆరాతీశారు. పర్యావరణ విపత్తుల సమయంలో తక్షణమే మత్స్యకారులకు సమాచారం అందించడానికి వీటిని వినియెగించేలా అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. మత్స్యకారుల భద్రత కోసం అధునాతిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన హెల్మెట్ల పై ప్రత్యేకంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన వివరించారు. రాష్ట్ర సరిహద్దులు దాటిన సమయంలో జిల్లాలోని మత్స్యకారులకు సమస్యలు ఏర్పాడకుండా అన్ని బోట్లకు కలర్ కోడింగ్ వేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాకు చెందిన 752 బోట్లకు కలర్ కోడింగ్ ద్వారా గుర్తింపు చిహ్నాన్ని ఏర్పాటు చేయగా, మిగిలిన వాటికి తక్షణమే గుర్తింపు చిహ్నాన్ని వేయాలని ఆయన తెలిపారు. కాంత్తపట్నం, పాలక, రామాయపట్నం, చీరాల ఓడరేవు వద్ద వాచ్ టవర్లు ఏర్పాటు చేయాలని .ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. రామాయపట్నం అవుట్ పోస్టు వద్ద మంచినీటి పైపులైను పంచాయితి ద్వారా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల భద్రత కోసం లైఫ్ జాకెట్లు ఇవ్వాలని ఆయన చెప్పారు. సముద్ర తీర ప్రాంతంలో మెరైన్ పోలీసులు భద్రతా చర్యలు తీసుకోవాలని, సంముద్రంలో గస్తీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో శిక్షణ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డి.ఆర్.ఓ.వి.వెంకట సుబ్బయ్య, కోస్టు గార్డ్ అధికారి సి.రవీందర్, మత్స్యశాఖ ఇన ఛార్జి ఎ.డి.రంగనాధ్ బాబు, విశాఖ సౌత్ మెరైన్ డి.ఎస్.పి.అదినారాయణ, ఒంగోలు ఆర్.డి.ఓ.ప్రభాకర్ రెడ్డి, డ్వామా పి.డి.శీనారెడ్డి, మెరైన్ సి.ఐలు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.