Highlights
- ఎన్‌సీసీ అంటే తెలియదనడం విచిత్రం
- ట్విటర్లో విరుచుకుపతున్న నెటిజన్లు

నేషనట్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) అంటే ఏమిటో తెలియదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. భారత ఆర్మీ నేతృత్వంలో స్కూల్ పిల్లలు మొదలు కాలేజీ యువకుల దాకా కొనసాగుతున్న ఈ వ్యవస్థ గురించి అతిపురాతన పార్టీ అధినేతకు తెలియకపోవడం విచిత్రంగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ట్విటర్లో పెను వివాదానికి దారితీసిన ఈ వ్యవహారంపై వివరాల్లోకి వెళితే... ఇవాళ మైసూరులోని మహారాణి ఆర్ట్స్ కాలేజి విద్యార్ధినులతో రాహుల్ కొద్దిసేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఓ విద్యార్ధిని రాహుల్‌గాంధీని ప్రశ్నిస్తూ.. ‘‘మీరు అధికారంలోకి వస్తే ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్ పాస్ అయిన వారికి ఏ ప్రయోజనాలు కల్పిస్తారు..?’’ అని అడిగింది. అందుకు రాహుల్ స్పందిస్తూ... ‘‘ఎన్‌సీసీ ట్రైనింగ్ వివరాలు నాకు తెలియదు. అక్కడ జరిగే కార్యకలాపాలు (స్టఫ్) కూడా నాకు తెలియదు. కాబట్టి నేను ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేను...’’ అనడంతో అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. ఈ మాటలు కాస్తా ట్విటర్లో దర్శనమివ్వడంతో నెటిజన్లు రాహుల్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.