భారీగా పెరగనున్న డిస్కం చార్జీలు
హైద్రాబాద్, డిసెంబర్ 27
ఆర్థిక లోటు ఏటేటా పెరిగిపోతుండటంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రంలోని విద్యుత్ డిస్కంలు చార్జీల పెంపును ప్రతిపాదించనున్నాయి. జనవరి 25తో మునిసిపల్ ఎన్నికలు ముగియనుండగా, 31న ఈఆర్సీకి డిస్కంలు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో భాగంగా ఈ పెంపు ప్రతిపాదనలను సమర్పించనున్నాయి.రాష్ట్రంలో గత మూడేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. 2019–20 ముగిసే నాటికి డిస్కంల ఆర్థిక లోటు రూ. 11,000 కోట్లకు చేరనుందని, బడ్జెట్‌లో ప్రభుత్వం కేటా యించిన రూ.6,079 కోట్ల విద్యుత్ రాయితీలు పోగా మొత్తం రూ.5,000 కోట్ల ఆర్థిక లోటు మిగలనుందని ఇంధనశాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సబ్సిడీలు తీసేసినా, 2020–21లో ఆర్థిక లోటు రూ. 6,000 కోట్లకు చేరనుందని అధికారవర్గాలు అంచనా వేశాయి. చార్జీల పెంపు ద్వారా సుమారు రూ.1000 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని డిస్కంలు భావిస్తున్నాయి. దీంతో గృహ, వాణిజ్య తదితర అన్ని కేటగిరీలపై వినియోగదారులపై మోస్తారుగా విద్యుత్ చార్జీల పెంపు ప్రభావం పడనుంది. నెలకు 100–200 యూనిట్ల విద్యుత్ వినియోగించే మధ్యతరగతి, 300 యూనిట్లపైగా వినియోగించే ఎగువ తరగతి కుటుంబాలపై చార్జీల పెంపు ప్రభావం చూపే చాన్సుంది. పారిశ్రామిక కేటగిరీ చార్జీలను స్వల్పంగా పెంచే అవకాశాలున్నాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి 2020–21కి సంబంధించిన టారీఫ్ ఉత్తర్వులను జారీ చేయనుంది. దీంతో 2020 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో చార్జీల పెంపు అమల్లోకి రానుంది.