Highlights
- ఎప్పుడు చేయాలో సరే
- అసలు ఆరోజు ఏమి చేయాలి?
శ్రీరామనవమి నాడు అసలు ఏమి చేయాలో ముందు తెలుసుకుని, 25 ఆదివారం చేయాలా? లేక 26 సోమవారం చేయాలా? అన్నది పరిశీలిద్దాం.
"తస్మిన్ దినే తు కర్తవ్యముపవాసవ్రతం సదా
తత్ర జాగరణం కుర్యాద్రఘునాథపరో భువి"
అని అగస్త్యసంహిత అనే గ్రంథం లో ఉన్నది. 1.అంటే ఆ రోజున #ఉపవాసవ్రతము ను ఆచరించాలి. రామమంత్రజపమో లేక రామకథాకాలక్షేపమో చేస్తూ జాగరణ కూడా చేయాలి.
2. హేమాద్రి అనే ధర్మశాస్త్ర గ్రంథమందు ఇలా ఉంది.
"యశ్చ రామనవమ్యాం తు
భుంక్తే మోహాద్విమూఢధీః
కుంభీపాకేషు ఘోరేషు
పచ్యతే నాత్ర సంశయః"
అనగా ఎవరైతే శ్రీరామనవమి నాడు భోజనం చేస్తాడో వాడు భయంకరమైన కుంభీపాకాది నరకాలలో పీడించబడతాడు.
అదే హేమాద్రియందు పితృతర్పణం కూడా నిర్దేశించబడింది. ఇవన్నీ కలిపి ఒక్క శ్లోకంలో ఇలా చెప్పారు.
"ఉపోషణం జాగరణం
పితౄనుద్దిశ్య తర్పణం
తస్మిన్ దినేతు కర్తవ్యం బ్రహ్మప్రాప్తిమభీప్సుభిః "
అనగా శ్రీరామనవమి నాడు
1. ఉపవాసము 2. జాగరణ 3. పితృతర్పణము అనే మూడు పనులూ మోక్షాభిలాషులు చేయాలి.
ఇక ఎప్పుడు చేయాలి? 25 నా? 26 నా?
25 వతేదీ ఆదివారం నాడు నవమి తిథి ఏష్యమైంది. మరునాడు సూర్యోదయానికి నవమిలేదు. కాబట్టి 25 న స్మార్తులు మరియు 26 న వైష్ణవులు చేయాలని ( 25న అష్టమీ విద్ధ అయినది కనుక) పంచాంగాలలో చాలమంది వ్రాయటం జరిగింది.
వైష్ణవులలో వైఖానసులు మరియు పాంచరాత్రులు అనే రెండు రకముల ఆగమానుయాయులు ఉన్నారు. భాగవతులు అనే మూడవ వారు కూడా ఉన్నట్లు కొన్ని గ్రంథాలు తెలుపుతున్నాయి. వీరిలో పాంచరాత్రులు అనే వైష్ణవులు అసలు రామనవమీవ్రతం ను ఆచరించరు. మిగిలినవారు ఆచరిస్తారని తెలుస్తోంది. అయితే వైష్ణవులుకూడా ఈ సారి అష్టమీవిద్ధ అయినప్పటికీ 25నే వ్రతాన్ని ఆచరించాలి.
హరిభక్తివిలాసం అనే గ్రంథంలో అలాగే ఉన్నది.
"దశమ్యాం పారణాయాం చ
నిశ్చయాన్నవమీ క్షయే
విద్ధాపి నవమీ గ్రాహ్యా
వైష్ణవైరప్యసంశయమ్"
అని ఉన్నది కాన రామనవమీవ్రతం ను స్మార్తులు, వైష్ణవులూ 25,ఆదివారం నాడే ఆచరించాలి.
వైష్ణవాగమాలలో అష్టమీవిద్ధ గురించి చెప్పినది ఉత్సవాదులకు అని తెలుస్తోంది.
కావున శ్రీరామనవమీ వ్రతం చేసుకుందామనుకునేవారందరూ కూడా ఉపోషణ, జాగరణ, పితృతర్పణాదులను ఆచరిస్తూ 25న ఆచరించడమే శాస్త్రసమ్మతం.
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః