గోదా అంతరార్థమిది
గోదాదేవి శ్రీరంగనాధుని పొందటానికి చేసిన ప్రయత్నం.. గోపికలు శ్రీకృష్ణుడిని చేరటానికి చేసిన ప్రయత్నం వెనక ఉన్న అంతర్యాన్ని గ్రహించగలిగితే భగవంతుడి లీలలు అర్థమవుతాయి.
సన్మార్గంలో ప్రయాణించే మానవుడు మూడు అంశాలను విధిగా పాటించాలి. వీటిలో మొదటిది శ్రవణం. రెండోది మననం. మూడోది ఆచరణ. ఈ మూడింటినీ ఈ 30 పాశురాల్లో వివరించింది శ్రీ ఆండాళ్లు. మొదటి ఏడు పాశురాలలోని పరమార్థాన్ని గతం వారం తెలుసుకున్నాం. ఈ వారం ఎనిమిదో పాశురం నుంచి ఉన్న విశేషాలు గమనిద్దాం.
గోపికా బాలికలను లేపుతూ గోదాదేవి కృష్ణుడి అంతఃస్వరూపాన్ని వివరిస్తోంది. ఎనిమిదో పాశురంలో మూడో గోపికాబాలికను నిద్ర లేపుతూ- తూరుపు తెలవారుతోంది. గేదెలు చిరుమేత కోసం బయట పచ్చిక బయళ్లలో తిరుగాడుతున్నాయి. నువ్వు తప్ప మిగిలినవారందరూ స్వామి సేవకై సిద్ధపడుతున్నారు.. అని తొందరపెడుతుంది. ఇక్కడ గేదెలను బాహ్య స్వరూపంలో కాకుండా- అజ్ఞానానికి, తమస్సుకు ప్రతీకలుగా భావించాలి. వెలుగు వచ్చినప్పుడు అవి బయటకు వెళ్లిపోతాయి. మళ్లీ రాత్రి అయితే తిరిగి వస్తాయి. మన అజ్ఞానాదులు కూడా అలాంటివే. గురోపదేశం వల్ల అవి బయటకు పోతాయి. మళ్లీ తిరిగి వస్తాయి. వాటిని రానిచ్చి- పాల వంటి మంచి విషయాలను మనం తీసుకొని, మళ్లీ బయటకు పంపేయాలి. అలా చేయటం వల్ల భగవంతుడికి దగ్గరవుతాం. ఇక తొమ్మిదో పాశురంలో నాలుగో గోపిక దాకా స్థిత ప్రజ్ఞుడికి ఉండాల్సిన యాతమావస్థ, వ్యతిరేకావస్థ, ఏకేంద్రీయావస్థ, వశీకారావస్థల గురించి వివరిస్తోంది. దీనిని ఎలా పొందాలో కూడా చెబుతోంది. పదో పాశురంలో అత్యంత సౌందర్యవతి అయిన ఐదో గోపిక గురించి వివరిస్తుంది. ఈమె కోసం కృష్ణుడు కూడా అనేక తిప్పలు పడుతూ ఉంటాడు. కానీ ఆమె ఒక అలౌకికమైన స్థితిలో ఉంటుంది. కృష్ణుడి కూడా స్పందించదు. పరమయోగులకు మాత్రమే సాధ్యమయిన అలాంటి అలౌకిక స్థితిని పొందిన ఆ గోపికను నిద్ర లేవమని గోదాదేవి ప్రార్థిస్తుంది. పదకొండో పాశురంలో ఆరవ గోపిక బాహ్య సౌందర్యంతో పాటుగా అంతః సౌందర్యాన్ని కూడా గోదాదేవి వర్ణిస్తుంది. పన్నెండో పాశురంలో రామాయణం ప్రతీకగా జీవిత రహస్యాలను వివరిస్తూ- లోకవిలక్షణమైన సాత్విక నిద్ర నుంచి గోపికను లేవమని గోదా దేవి ప్రార్థిస్తుంది. మన జీవితంలో బందీపబడిన జీవుడే సీత. రావణుడి చెరబడ్డ సీతలా మనం మనసు చేత వంచించబడ్డాం. అహంకారానికి బానిసలయ్యాం. శ్రీరాముడే లంకలోకి ప్రవేశించి చెర నుంచి సీతను విడిపించినట్లు- ఆచార్యుడు మన చెరను విడిపిస్తాడు. అయితే ఇది అంత సులభం కాదు. ఈ తత్వాన్ని గోదాదేవి ఈ పాశురంలో వివరించింది. ఇక ఎనిమిదో గోపికను నిద్ర లేపటానికి పదమూడో పాశురంలో గోదాదేవి ప్రయత్నిస్తుంది. ఈ ఎనిమిదో గోపిక అతి సుందర నేత్రి. ఈ నేత్రములు బాహ్య ప్రపంచాన్ని చూస్తాయి. కానీ అంతః ప్రపంచాన్ని చూసే నేత్రాలు వేరే ఉంటాయని ఈ పాశురంలో చెప్పకనే చెబుతుంది. పదనాలుగో పాశురంలో తొమ్మిదో గోపికను నిద్ర లేపటానికి ప్రయత్నిస్తుంది. ఈ గోపికకు నేర్పుగా మాట్లాడగలిగిన చాతుర్యముంది. అందరి కన్నా ముందు లేస్తానని చెప్పింది. కానీ లేవలేదు. దీని వెనకున్న రహస్యం గురించి ఈ పాశురంలో గోదాదేవి వివరిస్తుంది