YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 వెలుగులు సగమే.. (ప్రకాశం)

 వెలుగులు సగమే.. (ప్రకాశం)

 వెలుగులు సగమే.. (ప్రకాశం)
ఒంగోలు, డిసెంబర్ 27 విద్యుత్తు పొదుపుతోపాటు గ్రామ పంచాయతీలకు ఖర్చు తగ్గించేందుకు గత ప్రభుత్వం పల్లెల్లో ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటును అమల్లోకి తెచ్చింది. వాటి నిర్వహణ బాధ్యతను అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసు లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌)కు అప్పగించింది. అయితే కారణాలేవైనా ఇప్పటికీ జిల్లాలో సగం గ్రామాల్లోనే వీటిని అమర్చారు. మిగిలిన సామగ్రిని మండల పరిషత్తు, పంచాయతీ కార్యాలయాల్లో మూలనపడేశారు. దీంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలోని సగం పంచాయతీలకు స్థానికంగా ఆదాయ వనరులు తక్కువే. ఆయా గ్రామాల్లోని వసూళ్లు ఇంటి పన్ను సిబ్బంది జీతభత్యాలకు సైతం సరిపోవు. విద్యుత్తు బిల్లులే కాదు.. నెలనెలా వీధి దీపాలు సైతం కొనలేని దుస్థితి. అన్నింటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అందులోనూ 15 శాతం మాత్రమే వినియోగించవలసి ఉండటంతో పంచాయతీలకు విద్యుత్తు బిల్లుల బకాయి గుది బండలా మారుతోంది. దాంతో పొదుపుతోపాటు బిల్లుల సమస్యను నియంత్రించే దిశగా గత ప్రభుత్వం చర్యలు చేపట్టగా వినియోగం 50 శాతానికి తగ్గింది. పొదుపుతో మిగిలిన మొత్తంలో 40 శాతాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌కు చెల్లించాలి. మిగిలిన పది శాతం పంచాయతీకి కలిసొస్తుంది. ఇందుకుగాను ఆ సంస్థ పదేళ్లపాటు బల్బుల నిర్వహణ బాధ్యత చూసుకుంటుంది. ఆ తర్వాత పంచాయతీకి అప్పగిస్తుంది.   జిల్లాలోని 56 మండలాల్లో 1038 గ్రామ పంచాయతీలుండగా సగం వాటిల్లో మాత్రమే ఎల్‌ఈడీ దీపాలు అమర్చారు. ఒంగోలు రెవెన్యూ డివిజన్లో 353కు 251, కందుకూరు డివిజన్లో 447కు 307 పంచాయతీల్లో బల్బులు వేశారు. మార్కాపురం డివిజన్లోని యర్రగొండపాలెం, మార్కాపురంలో వంద శాతం అమర్చగా త్రిపురాంతకం, పెదదోర్నాల మండలాల్లో 50 శాతం మేర మాత్రమే బిగించారు. ఈ డివిజన్లోని మిగతా ఎనిమిది మండలాల్లో ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు 1,49,382 స్తంభాలకు దీపాలు అమర్చగా వాటిలో 10,357 పగటి వేళా వెలుగుతున్నాయని గ్రామ కార్యదర్శులు యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. వాటిలో కేవలం 3,462 బల్బుల సమస్యను మాత్రమే సంస్థ ఇప్పటి వరకు పరిష్కరించింది. కొన్ని రాత్రి పూటా పనిచేయడం లేదు. దీనిపై ఫిర్యాదులు అందుతున్నా సిబ్బంది అందుబాటులో లేని కారణంగా సకాలంలో పరిష్కరించలేకపోతున్నారు. కందుకూరు డివిజన్లోని ఎక్కువ గ్రామాల్లో సాంకేతిక కారణాలరీత్యా పగటి సమయంలో బల్బులు వెలుగుతున్నాయి. దీనిపై కార్యదర్శుల నుంచి ఫిర్యాదులు ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు.  సార్వత్రిక ఎన్నికల ముందుగానే 50 శాతం గ్రామాల్లో శత శాతం స్తంభాలకు ఎల్‌ఈడీ దీపాలు వేశారు. అప్పటికే గ్రామ పంచాయతీ పాలకవర్గాలులేని కారణంగా కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. ఆ తర్వాత పంచాయతీ ఖాతాల్లో కొద్ది మొత్తంలో నిధులున్నా... ఖజానాపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మొదట బల్బులు వేసిన తాలూకు డబ్బు ఇంత వరకు కార్పొరేషన్‌కు పైసా చెల్లించలేదు. దాంతో ఆ సంస్థ మిగతా గ్రామాలకు ఎల్‌ఈడీ దీపాలు వేయవద్దని తమ క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించగా ఆ సామగ్రి మండల, పంచాయతీ కార్యాలయాల్లోనే నిల్వ ఉంచారు.

Related Posts