రూపాయి పథకం కంచికేనా..?
కరీంనగర్, డిసెంబర్ 27 (న్యూస్ పల్స్): దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘రూపాయికే అంత్యక్రియల పథకం’ పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండగా, ఆ పథకం అమలులో నిర్లక్ష్యం చోటు చేసుకుంటోంది. నగర పరిధిలో పేదలు, అనాథలు ఎవరు చనిపోయినా సరే నగరపాలిక ద్వారానే ఒక్క రూపాయితో దహన సంస్కారాలు పూర్తి కావాల్సి ఉండగా ఇటీవల అలా జరగడం లేదని, దీనికి సంస్థ ద్వారానే అడ్డంకులు వస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో దేశంలో ఎక్కడా లేని విధంగా ‘రూపాయికే అంత్యక్రియలు’ పథకాన్ని ఈ ఏడాది జూన్ 15న ప్రారంభించారు. అప్పటి నుంచి పథకం పకడ్బందీగా నిర్వహించేందుకు, పర్యవేక్షణ చేసేందుకు కొద్ది రోజులు ప్రత్యేక అధికారులుగా కార్పొరేషన్ డీఈఈలకు బాధ్యతలు అప్పగించారు. నగరపాలిక పారిశుద్ధ్య విభాగం ద్వారా అంత్యక్రియల కార్యక్రమాన్ని పూర్తిచేసేందుకు సమస్యలు వస్తుండటంతో దీనికి టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్ కు అప్పగించారు. నగరపాలిక జవాన్లు, ఇన్‌స్పెక్టర్లు ఆయా వీధుల్లో ఎవరు చనిపోయినా సరే అక్కడికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబ సభ్యులు అంగీకరిస్తే రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక రూపాయి తీసుకొని రసీదు ఇస్తారు. అప్పుడు ఆ కాంట్రాక్టర్ ఆయా మత సంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. నగరపాలికకు రూపాయి చెల్లిస్తే చాలు అంత్యక్రియల కార్యక్రమాన్ని నగరపాలిక పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం నగరపాలిక రెండు వాహనాలు కొనుగోలు చేసింది. రెండు ఫ్రీజర్లు కొనుగోలు చేశారు. ఒక్కో అంత్యక్రియకు కాంట్రాక్టర్ కు రూ.8 వేలు నగరపాలిక చెల్లిస్తోంది. వీరి ద్వారానే శ్మశాన వాటికలో దహనం, ఖననం చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయిస్తారు. ఆయా మతాలు, ఆచారాలకు అనుగుణంగా దహన సంస్కారాలు చేపడుతున్నారు. అంత్యక్రియల పథకం కోసం నగరపాలక సంస్థ ప్రత్యేకంగా రెండు వాహనాలు కొనుగోలు చేసింది. అంతిమ యాత్రగా శ్మశానవాటికకు వెళ్లడానికి ఈ వాహనాలను ఉపయోగించుకునే వీలుంది. అయితే డ్రైవర్లు లేరని, డీజిల్ లేదని పేర్కొంటూ వాహనాలను అంత్యక్రియలకు పంపించడం లేదు. రెండింటిలో ఒక వాహనం మాత్రమే ఉపయోగంలో ఉండగా మరొకటి మూలన పడింది. డ్రైవర్లను అందుబాటులో ఉంచకపోవడంతోనే ఈ సమస్య వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చనిపోయిన శవాలు చెడిపోకుండా ఉండేందుకు వీలుగా కొద్ది గంటల పాటు ఉంచేందుకు రెండు ఫ్రీజర్లు ఆరు నెలల కిందట కొనుగోలు చేశారు. అప్పటి నుంచి మూలన పడి ఉన్నాయి. దీన్ని ఏవిధంగా ఉపయోగించాలనే విషయాలపై ఒక మెకానిక్ లేకపోవడం, ప్రత్యేక వాహనం సమకూర్చకపోవడంతో వాటిని ఉపయోగించడం లేదు. ఇంకొద్ది రోజులైతే ఆ యంత్రాలు పనికి రాకుండా పోతాయని చెబుతున్నారు. దహన సంస్కారాలు చేసేందుకు కావాల్సిన వస్తువులన్నీ సదరు కాంట్రాక్టర్ తీసుకొచ్చి కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే డీజిల్ లేదని చెప్పడం, పూలదండల ధరలు పెరిగాయని, బాధితులే తెచ్చుకోవాలని చెప్పడం, తీరా శ్మశానవాటికలో కర్రెల దగ్గర వాగ్వాదాలు చోటుచేసుకోవడం వంటి ఇబ్బందులు వస్తున్నాయి. అప్పటికే శోక సముద్రంలో మునిగి ఉన్న బాధితులే వీటిని సమకూర్చుకుంటున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగంగా ఉన్న ఈ పథకంపై నగరపాలిక సమీక్షించడం అత్యవసరం. పథకం ప్రారంభించే సమయంలో ప్రత్యేక విభాగం, నగరవాసులకు ఒక ఫోన్ నంబర్ కేటాయిస్తామని అప్పట్లో ప్రకటించారు. అదేదీ లేకపోగా కనీసం అంత్యక్రియల నిర్వహణ తీరు, పథకం అమలులో జరుగుతున్న లోపాలు, ఇబ్బందులపై సంబంధిత శాఖతో సమీక్ష లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎంతో ఆదరణ పొందిన ఈ పథకంపై పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది.