నెంబర్ ప్లేట్ల లేని వాహానాలకు చుక్కలే
హైద్రాబాద్, డిసెంబర్ 28,
గ్రేటర్ లో నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తున్న వెహికల్స్ ను గుర్తించేందుకు 3 కమిషనరేట్లలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ నంబర్ ప్లేట్ ను ట్యాంపరింగ్ చేసి రూల్స్ బ్రేక్ చేస్తున్న వెహికల్స్ సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారిపై పోలీసులు ఫోకస్ పెట్టి ఆ వెహికల్స్ ను సీజ్ చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేయడం, సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ లాంటి రూల్స్ బ్రేక్ చేస్తున్న కొందరు వాహనదారులు చలాన్లు పడకుండా ఉండేందుకు నంబర్ ప్లేట్ ను ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఇలాంటి వెహికల్స్ రూల్స్ బ్రేక్ చేసి సీసీ కెమెరాలకు చిక్కినా నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడంతో వారికి చలానా జనరేట్ చేసేందుకు పోలీసులకు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందులో కొందరు ప్లాన్ ప్రకారం నంబర్ ప్లేట్ లో ఉన్న లెటర్స్ ను తొలగిస్తుంటే మరికొందరు నకిలీ నంబర్ ప్లేట్లతో సిటీలో చక్కర్లు కొడుతున్నారు. బైక్స్ వెనుక ఉన్న 4 నంబర్లలో ఓ నంబర్ ను తొలగిస్తున్నారు. నంబర్ ప్లేట్ చివర ఓ నంబర్ కనిపించకుండా బెండ్ చేస్తున్నారు. దీంతో పాటు రిజిస్ట్రేషన్ నంబర్ లోని టీఎస్,ఏపీ అక్షరాలతో పాటు చివరి రెండు నంబర్లు కనిపించకుండా స్టిక్కర్స్,ప్లాస్టర్స్ వేస్తున్నారు. ఇదే కాకుండా ట్రాఫిక్ పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ముందు నంబర్ ప్లేట్ కరెక్ట్ గా ఉన్నప్పటికీ వెనుక నంబర్ ప్లేట్ మాత్రం బెండ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ చలానాలు జనరేట్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ రాంగ్ నెంబర్ ప్లేట్లతో సిటీ రోడ్లపై ఇష్టమొచ్చినట్లుగా దూసుకుపోతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. వీటితో పాటు సిగ్నల్స్ వద్ద,సిటీ రోడ్లపై నిరంతరం రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ఇలా ట్రాఫిక్ చలానాలను తప్పించుకునేందుకే కొందరు నంబర్ ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నారు. ఇందులో ప్రధానంగా హెల్మెట్,హైస్పీడ్,రాంగ్ సైడ్ డ్రైవింగ్,సిగ్నల్ జంపింగ్ లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలే ఎక్కువగా ఉన్నాయి. రాంగ్ నంబర్ ప్లేట్స్ తో సిటీ రోడ్లపై ఆవారాలు అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడం ప్రమాదాలకు కారణమవుతోంది. ఇలాంటి ట్యాంపర్ నంబర్ ప్లేట్స్ ఉన్న బైక్స్,వెహికల్స్ వల్ల ఏదైనా నేరం జరిగినా, రోడ్ యాక్సిడెంట్స్ జరిగినా కేసు దర్యాప్తులో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి.నంబర్ లేని బైక్స్ పై స్నాచింగ్ చేస్తున్న చైన్ స్నాచర్లు, క్రిమినల్స్,రోడ్లపై పోకీరీలు ఫేక్ నంబర్ ప్లేట్ తో నేరాలకు పాల్పడితే పట్టుకోవడం కష్టమవుతోంది. కొన్ని కేసుల్లో తమ ప్రమేయం లేకుండానే నిజమైన వాహన యజమానులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఏడాది కాలంగా హైదరాబాద్,సైబరాబాద్,రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సరిగా లేని నంబర్ ప్లేట్ ల తనిఖీ పేరుతో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా ట్రాఫిక్ పోలీసులు చేసిన కేస్ స్టడీస్ తో గ్రేటర్ పరిధిలోని 18 శాతం బైక్ లు ట్రాఫిక్ చలాన్లను తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్ ను మార్చేస్తున్నారని గుర్తించారు. 3 కమిషనరేట్ల పరిధిలో ప్రతి నెలలో వారం రోజుల పాటు నంబర్ ప్లేట్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసులు బుక్ చేస్తున్నారు. నంబర్ ప్లేట్ స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడుతున్న వాహనదారులపై వెహికల్స్ ను మోటార్ వెహికల్ యాక్ట్ సీజ్ చేస్తున్నారు.ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇలాంటి ట్యాంపర్ నంబర్ ప్లేట్స్ తో చైన్ స్నాచర్లు,దొంగలు,అసాంఘిక శక్తులు నేరాలకు పాల్పడే అవకాశాలు ఉండడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ట్యాంపర్ చేసిన బైక్ ఆర్సీ,బైక్ ఓనర్ తో పాటు చలానాలను చెక్ చేస్తున్నారు. దీంతో పాటు చోరీకి గురైన వాహనాల డేటాతో పోల్చి చూస్తున్నారు. ఏదైన బైక్ అనుమానాస్పద స్థితిలో పట్టుబడితే స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించి క్రిమినల్ హిస్టరీ బయటకు తీస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు ఈ ఏడాది 32 క్రిమినల్ కేసులు బుక్ చేశారు.ఈ నెల 14 నుంచి18 వరకు కమిషనరేట్ పరిధిలోని 10 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో డ్రైవ్లో నంబర్ ప్లేట్స్సరిగా లేని వెహికల్స్ పై మొత్తం 2,028 కేసులు నమోదు అయినట్టు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అత్యధికంగా మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ లో 395 కేసులు .. షాద్నగర్ పీఎస్లో తక్కువగా 65 కేసులు నమోదయ్యాయన్నారు. వెహికల్ నంబర్ ప్లేట్ కి కలర్స్ వాడటం, డిజైన్స్ చేయించడం, విరిగిన ప్లేట్స్ వాడటం చేయొద్దని ఆయన చెప్పారు. మరోవైపు ఐదురోజుల క్రితం నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన 20 బైక్ లను శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ఇందులో రిజిస్ట్రేషన్ లేని బైక్ లు 6, డిజిట్స్ కట్ చేసినవి, ట్యాంపరింగ్ చేసిన బైక్ లు 14 ఉన్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.