ఇక ఆ స్కూళ్లు...బంద్
రంగారెడ్డి, డిసెంబర్ 28,
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది. గవర్నమెంట్ స్కూల్స్ సంఖ్యను కుదించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 3529 ప్రభుత్వ స్కూళ్లున్నాయి. వీటిలో 1215 స్కూళ్లు ఒకే ప్రాంగణంలో, ఓకే ఊరి పరిధితో పాటు 50 మీటర్ల దూరంలో ఉన్నాయి. వీటిని క్లబ్ చేసేందుకు విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో నాలుగు జిల్లాల పరిధిలో సుమారుగా 765 స్కూళ్లను మూసివేయనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో 3529 స్కూల్స్‌కు గాను కుదింపుతో స్కూళ్ల సంఖ్య 2764కు చేరనుంది.రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్‌కు ఉన్న ప్రాధాన్యం ప్రభుత్వ స్కూల్స్‌కు ఉండడం లేదు. ప్రధాన పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకప్పుడు విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉండేది. చుట్టు పక్కలుండే గూడెంలు, తండాలు, గ్రామాల నుంచి విద్యార్థులు పట్టణ ప్రాంతంలో ఉండే ప్రభుత్వ స్కూల్స్‌కు వచ్చి విద్యను అభ్యసించే వారు. అలాంటి పరిస్థితి నుంచి ఊళ్లోనే ఉన్న ప్రభుత్వ స్కూల్స్‌కు వెళ్లేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. దీంతో స్కూళ్ల సంఖ్య ఎక్కువైంది.. విద్యార్థుల సంఖ్య తక్కువైంది. ఫలితంగా స్కూళ్ల నిర్వహణలో ఆర్థిక భారం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్‌లో ఐదు తరగతులకు ఒక్కరే టీచర్ బోధిస్తున్నారు. దీంతో విద్యలో నాణ్యత పెరగడం లేదని అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 12 తరగతులు నడుస్తున్నాయి. దీని వల్ల ఒక విద్యార్థి ఒకటో తరగతిలో చేరితే 12వ తరగతి వరకు చదువు మానకుండా ఉంటారన్నది భావన. అదేవిధంగా రాష్ట్రంలో హైస్కూల్స్ ప్రాంగణంలోని బడులను ఒకటిగా మార్చి ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉండేలా చేస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.రాజస్థాన్‌లోనూ హైస్కూల్స్‌లో 1-12వ తరగతి వరకు నడుస్తున్నాయి.మౌలిక వసతులను సమర్థంగా వినియోగించుకోవచ్చు. ప్రాథమిక పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది కొరత సమస్య తీరుతుంది.ప్రస్తుతం ప్రైమరీ, హైస్కూళ్లలో ప్రారంభ వేళలు వేర్వేరుగా ఉన్నాయి. విలీనం చేస్తే ఆ సమస్య ఉండదు.
హైస్కూల్స్‌కు ప్రధానోపాధ్యాయుడు ఉంటారు కాబట్టి పర్యవేక్షణ పెరుగుతుంది.