YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 పురపోరుకు కసరత్తు (కరీంనగర్)

 పురపోరుకు కసరత్తు (కరీంనగర్)

 పురపోరుకు కసరత్తు (కరీంనగర్)
కరీంనగర్ డిసెంబర్ 28 పురపాలక ఎన్నికల నిర్వహణ కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తి కాగా.. తుది జాబితాను పురపాలక శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ జాబితాల ఆధారంగా ఆశావహుల్లో కొందరికి ఖేదం, మరికొందరికి మోదం కలిగినా.. సర్దుబాటు చేసుకునే పనిలో పడ్డారు..మరోవైపు ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రకటన త్వరలోనే విడుదల కానుండటంతో ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వార్డులు, డివిజన్ల తుది జాబితాలు ప్రకటించడంతో పట్టణాల్లో రాజకీయ సందడి మళ్లీ మొదలైంది. కరీంనగర్‌ నగరపాలిక పరిధిలో ఆ జాబితాలు చూసుకున్న ఆశావహులు అభ్యంతరాలను కూడా పరిశీలించకుండా అన్యాయం చేశారంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అస్త్రాలన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో నగరపాలిక ఎన్నికలు జరిగేంత వరకు ఉత్కంఠ తప్పడం లేదని మరికొందరు అంటున్నారు  పురపాలికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఔత్సాహికులు, ఆశావహులు, మాజీ పాలకవర్గ సభ్యులు ప్రకటించిన పునర్విభజన జాబితాలు తీసుకొని ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. మారిన స్వరూపంతో గత్యంతరం లేక అనుకూలమైన వార్డులు, డివిజన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్‌ నగర పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా 2,57,786 మంది ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒక్కో డివిజన్‌లో 5 నుంచి 10 శాతం హెచ్చు, తగ్గుదలతో కనిష్ఠంగా 4,080 మంది ఓటర్లు 60వ డివిజన్‌లో ఉండగా, గరిష్ఠంగా 4,912 మంది ఓటర్లతో 8వ డివిజన్‌ ఉంది. ఈ లెక్కల ఆధారంగా మున్సిపాలిటీల్లో, నగరపాలికల్లో ఏ వార్డు, డివిజన్‌ ఏ రిజర్వేషన్‌ కిందకు వస్తుందో తెలియని గందరగోళం ఆశావహుల్లో నెలకొంది. మారిన లెక్కల ప్రకారం రిజర్వేషన్లపై ఆసక్తి ఏర్పడగా ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పుర, నగరపాలక అధికారులు ఓటర్ల జాబితాలు, వార్డులు, డివిజన్ల వారీగా వేరు చేసుకొని సిద్ధంగా ఉండేలా ముందస్తు చర్యలు ప్రారంభించారు. ఓటర్ల సంఖ్య కొన్ని డివిజన్‌లలో పెరగగా, మరికొన్నింటిలో తగ్గింది. ఒకటి, రెండు వార్డుల్లో ఒక డివిజన్‌ ఓటర్లు మరో డివిజన్‌లోకి రావడంతో వాటిని సరిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటన ఆధారంగా ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటిస్తారు. అభ్యంతరాలను పరిశీలించిన పూర్తయిన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు డివిజన్లు, వార్డు, ఛైర్మన్‌, మేయర్ల రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. కొత్త పురపాలక చట్టం ఆమోదం కావడంతో రిజర్వేషన్ల ప్రక్రియ ఇప్పటి నుంచే అమలు కానుంది. గతంలో రాష్ట్రాన్ని యూనిట్‌గా రొటేషన్‌ పద్ధతిని అనుసరించి నిర్ణయించే వారు. ప్రస్తుతం రాష్ట్రం యూనిట్‌గా పురపాలక సంఘాలకు ఛైర్మన్‌ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త చట్టం ప్రకారం రిజర్వేషన్లు పదేళ్లకు అమలు చేసేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts