YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బస్తీమే సవాల్.. (నిజామాబాద్)

బస్తీమే సవాల్.. (నిజామాబాద్)

బస్తీమే సవాల్.. (నిజామాబాద్)
నిజామాబాద్, డిసెంబర్ 28 మున్సిపల్ వార్డులు.. డివిజన్ల హద్దులు తేలటంతో పట్టణాల్లో రాజకీయ సందడి మొదలైంది. పురపాలక సంఘ ఎన్నికల ప్రక్రియలు ఒక్కొక్కటి పూర్తవుతున్నాయి. త్వరలోనే నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. దీంతో ప్రధాన పార్టీలు ఓట్ల పోటీకి సన్నద్ధమవుతున్నాయి. ప్రజల దృష్టిని ఆకర్షించేలా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఆశావహులేమో ఆయా పార్టీల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ నేతల దృష్టిలో పడేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ పరిణామాలతో మొత్తంగా బస్తీ రాజకీయాలు ఊపందుకున్నాయి. కొత్త సంవత్సరం ఆరంభంలోనే పురపీఠాలపై నూతన పాలక వర్గాలు కొలువుదీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆలోచన ఇదే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మున్సిపల్‌ పరిపాలన విభాగం వార్డుల విభజన జాబితాలకు గురువారం ఆమోదం తెలపటం ద్వారా ఇదే సంకేతాలిచ్చింది. ఈ విషయాలను పసిగట్టిన పార్టీలు గెలుపు వ్యూహాలు సిద్ధం చేసుకొనే పనిలో నిమగ్నమయ్యాయి. ఇందుకు తగిన కార్యాచరణను తయారు చేసుకొనే పనిని ఇప్పటికే మొదలెట్టాయి. అంతర్గత సమావేశాల్లో ఆయా విషయాలపై ముఖ్య నాయకులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వార్డుల విభజన పూర్తయింది. ఏ వాడ ఏ వార్డులోకి వస్తుందో జాబితాల్లో పొందుపరిచారు. వీటిని చూసిన మాజీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కొందరు.. క్షేత్రస్థాయిలో తమ పరిధిలోకి వచ్చే ఓటర్ల ఎవరనే విషయాలు అర్థం కాక నెత్తి గోక్కుంటున్నారు. ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర దిక్కులను ప్రమాణంగా చేసుకొని వార్డుల పునర్విభజన చేపట్టారు. ఈ క్రమంలో వార్డుల సంఖ్య, పరిధులు మారాయి. ఈ సారి ఎలాగైనా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎదురుచూస్తున్న ఆశావహులు సైతం వార్డు హద్దుల జాబితాలు అంతర్జాలం చూస్తూ అర్థం చేసుకొనే పనిలో పడ్డారు. మరికొందరైతే ఏమీ అర్థం కాక ఓటర్ల జాబితా వచ్చే వరకు వేచి ఉండి, ఆ జాబితాల ఆధరంగా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. గతంలో కౌన్సిలర్‌, కార్పొరేటర్లుగా పోటీ చేసిన వారు, ఆశావహహులు తాము తిరిగి పోటీ చేయాలని భావిస్తున్న వార్డు, డివిజన్‌లో కొంత మార్పులు చోటుచేసుకున్నాయి. పునర్విభజనతో కొంత భాగం పక్క వార్డులోకి పోవటంతో పాటు.. కొత్తగా మరో కొంత భాగం ఆ ప్రాంతంలోకి వచ్చి చేరింది. దీంతో పలుకుబడి, పరిచయాల దృష్ట్యా కొత్తగా మార్పులు జరిగిన ప్రాంతాల్లో ఏ వార్డు అయితే తమకు అనుకూలంగా ఉంటుందని పరిశీలన చేసుకొనే పనిలో పడ్డారు. అంతిమంగా రిజర్వేషన్లు కలిసి రావాల్సి ఉన్నా.. రెండుగా చీలిన పాత వార్డులో ఎక్కడైనా పోటీకి సిద్ధంగా ఉండాలనే భావనతో కొందరున్నారు. రోస్టర్‌ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశంపై చర్చ జరుగుతుండటంతో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చి క్షేత్రస్థాయిలో అంతర్గతంగా ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొన్నిరోజులుగా పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు.. లబ్ధిదారులకు సంక్షేమ పథకాల అందజేత కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఆశావహులు పెద్దసంఖ్యలో ఉంటున్నారు. వీరంతా నేతల నుంచి హామీ పొందేలా ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యే హయాంలో పట్టణంలో సమకూర్చిన సౌకర్యాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలతో ముద్రించిన క్యాలెండర్లు ముద్రించి అందిస్తున్నారు. తద్వారా మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బీజేపీ విషయానికి వస్తే కేంద్రంలో రెండోసారి అధికారంలోకి రావటంతో పాటు నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో విజయంతో నాయకులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. గతంలో కంటే పార్టీ పరిస్థితి మెరుగవటంతో పోటీకి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. పట్టణ కమిటీ ఆధ్వరంలో ఇటీవలే సమావేశాలు జరిగాయి. మున్సిపల్‌ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఇతర ప్రాంతాల నాయకులతో కమిటీలు వేస్తున్నారు. కేంద్రం పథకాలు, మోదీ పాలన విషయాలను ఓటర్లకు వివరించేలా కార్యాచరణ ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఓటమిలతో డీలా పడిన కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపే కార్యక్రమంలో భాగంగా ఇదివరకే సమావేశాలు నిర్వహించింది. మైనార్టీ విభాగం సదస్సు,లను ఇటీవల జరపగా, తాజాగా పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశాలు పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిల్లో నిర్వహిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా కార్యాచరణను సిద్ధం చేసుకొంటున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బలాన్ని చాటుకునేందుకు గెలుపు వ్యూహాలు రచించే పనిలో పడ్డారు.

Related Posts