YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ వెనక్కి..? (కర్నూలు)

మళ్లీ వెనక్కి..? (కర్నూలు)

మళ్లీ వెనక్కి..? (కర్నూలు)
కర్నూలు, డిసెంబర్ 28 తెలుగుగంగ లైనింగ్‌ పనులు మరోసారి వెనక్కి వెళ్లాయా? రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పరిశీలిస్తున్న 12 సీమ ప్రాజెక్టుల్లో ఈ పనుల ప్రస్తావన లేకపోవడం ప్రస్తుతం నీటిపారుదల శాఖలో చర్చకు దారి తీస్తోంది. పదేళ్లుగా మిగిలిపోయిన తెలుగుగంగ లైనింగ్‌ పనులు ఒక అడుగు ముందుకు ఆరడుగులు వెనక్కి చందంగా మారాయి. వెలుగోడు రిజర్వాయర్‌ నుంచి 18 కి.మీ. పొడవునా తెలుగుగంగ కాల్వకు లైనింగ్‌ పనులు జరగాల్సి ఉంది. వెలుగోడు నుంచి ఓంకారం వరకు జరగాల్సిన ఈ పనులకు దశాబ్దకాలంగా పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ఆధునికీకరణ కాలువ వెడల్ఫు.బనకచర్ల సముదాయం వద్ద పూల్‌పాండ్‌ నిర్మాణ పనులు, గాలేరు-నగరి కాల్వల సామర్థ్యం పెంపుపై సీఎం పరిశీలన చేస్తున్న నేపథ్యంలో మరోసారి తెలుగుగంగ కాల్వ లైనింగ్‌ పనులు తెరపైకి వచ్చాయి.
తెలుగుగంగ కాల్వ 0 నుంచి 18 కి.మీ. పొడవునా లైనింగ్‌ పనులతోపాటు 18 నుంచి 42 కి.మీ. పొడవునా అక్కడక్కడా మిగిలిపోయిన లైనింగ్‌ పనులకు గత ప్రభుత్వ హయాంలో రెండేళ్ల క్రితం టెండర్లు పిలిచారు. ఈ టెండరులో భాగంగానే నిర్మాణాలతోపాటు బనకచర్ల నుంచి వెలుగోడు తెలుగుగంగ ప్రాజెక్టు లింక్‌ ఛానల్‌కు కూడా కొద్దిపాటి మరమ్మతులు చేసేవిధంగా రూపకల్పన చేశారు. రూ.240 కోట్ల అంచనాతో పిలిచిన పనులను గుర్తింపు పొందిన కాంట్రాక్ట్ సంస్థ అంచనా కన్నా 2.89 శాతం ఎక్కువతో టెండరు వేసి దక్కించుకుంది. ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది కూడా. కానీ పనులు చేయలేదు. దీంతో అధికారులు గుత్తేదారు సంస్థకు తాఖీదులు జారీ చేశారు. పంటల సమయం కావడంతో మార్చి నుంచి పనులు చేస్తామని చెప్పింది. పనులు చేయకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేశారు. గత ఏడాది జూన్‌ నుంచి ఆగస్టు మధ్యలో పనులు చేస్తామని చెప్పింది. అయినా ప్రారంభించలేదు. మూడు సార్లు తాఖీదులు జారీ అయినా పనులు మాత్రం మొదలు కాలేదు. ఈలోపు ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడం జరిగాయి. పనులు జరగకపోవడంతో టెండరును రద్దు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రణాళిక రూపొందించిన పనుల్లో రద్దు చేసిన లైనింగ్‌ ప్రాజెక్టు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం తెలుగుగంగ కాల్వలో నీటి ప్రవాహం 3 వేల క్యూసెక్కులుగా ఉంది. లైనింగ్‌ పూర్తిచేస్తే ఈ ప్రవాహం 5 వేల క్యూసెక్కుల వరకు పెరుగుతుంది. లైనింగ్‌ జరగాల్సిన ప్రాంతం 18 కి.మీ. పొడవునా 22 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. లైనింగ్‌ జరగకపోవడంతో నీటి ప్రవాహం ఉన్నా ప్రతి ఏడాది 2 నుంచి 3 వేల క్యూసెక్కులు వృథాగా పోతున్నాయి. గతంలో లైనింగ్‌ పనులు ప్రాజెక్టు చివరి నుంచి ప్రారంభిస్తూ వచ్చిన అనంతరం 2008లో 18 కి.మీ. వద్ద ఆగిపోయాయి. 2007లో భారీగా వచ్చిన వరదతో అప్పట్లో లైనింగ్‌ పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థ యంత్రాలు, పరికరాలు భారీగా దెబ్బతిన్నాయి. అప్పట్లో ఈ పనులు ఆగిపోయాయి. 2008లో చివరిగా లైనింగ్‌ పనులు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. నాటి నుంచి రెండుమూడుసార్లు ఈ పనులకు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు.

Related Posts