ఎల్‌ఐసీ డివిడెండ్ రూ.2,611 కోట్లు
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,610.74 కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) చెల్లించింది. ఈ చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్‌ఐసీ ఛైర్మన్ ఎం.ఆర్.కుమార్ శుక్రవారం అందచేశారు. కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌కుమార్ పాల్గొన్నారు. 2018-19లో ఎల్‌ఐసీ రూ.53,214.41 కోట్ల మిగులు సాధించింది. 2017-18 కంటే ఇది 9.9 శాతం అధికం. మొత్తం పాలసీల్లో ఎల్‌ఐసీ వాటా 76.28 శాతం కాగా, తొలి సంవత్సర ప్రీమియంలో 71 శాతం వాటా సంస్థదేనని ఆర్థిక శాఖ తెలిపింది. ఎల్‌ఐసీ చరిత్రలోనే విలువ పరంగా మిగులు రూ.50,000 కోట్లు అధిగమించడం ఇదే తొలిసారని ప్రకటించింది. 63 ఏళ్ల సర్వీస్ పూర్తయిన ఎల్‌ఐసీ, రూ.31.11 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. సంస్థ వార్షికాదాయం రూ.5.61 లక్షల కోట్లు ఉండగా, 2018-19లో తొలి వార్షిక ప్రీమియం ఆదాయం రూ.1,42,191.69 కోట్లని ఆర్థిక శాఖ వివరించింది. అదే ఏడాది రూ.1.63 లక్షల కోట్ల విలువైన 2.59 కోట్ల క్లెయిమ్‌లను సంస్థ పరిష్కరించింది.